వర్షాలకు తగిన పారిశుధ్య నిర్వహణ చేపట్టండి – కమిషనర్ జాహ్నవి ఆదేశం

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని అన్నీ డివిజన్లలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, వర్షాకాలానికి తగిన విధమైన ప్రణాళికలతో సంసిద్ధంగా ఉండాలని కార్పొరేషన్ కమిషనర్ జాహ్నవి అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 8 వ డివిజన్ రామ్ నగర్, 10 వ డివిజన్ ఏసీ నగర్ తదితర ప్రాంతాలను అధికారులతో కలిసి కమిషనర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలాన్ని నగర ప్రజలంతా దృష్టిలో ఉంచుకుని ఎలాంటి వ్యర్ధాలను డ్రైనేజీ కాలువల్లో పారవేయొద్దని, ముఖ్యంగా ప్లాస్టిక్ కవర్లతో కాలువల్లో ప్రవాహం నిలిచిపోతుందని తెలిపారు. తడి, పొడి చెత్తలను విడివిడిగా సేకరించినపుడే రీసైక్లింగ్ పద్ధతి ద్వారా సేంద్రీయ ఎరువులను తయారు చేయగలమని, నగర పాలక సంస్థ చెత్త సేకరణ వాహనాలకు నగర పౌరులంతా విడివిడిగా చెత్తను అందించి సహకరించాలని కోరారు. నేరుగా ఇంటి నుంచే వ్యర్ధాలను సేకరించినపుడు వీధుల్లోని పెద్ద డస్ట్ బిన్ ల అవసరం ఉండదని తెలిపారు. డస్ట్ బిన్ ల వలన పందులు, పశువులు, కుక్కలు వంటి జంతువులకు ఆవాసం ఉండక జనావాసాల్లో వాటి సంచారంపై నియంత్రణ ఉంటుందని తెలిపారు. నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో పారిశుద్ధ్య పనులను క్రమం తప్పకుండా నిర్వహించేలా ప్రజలు కూడా స్వచ్ఛందంగా పర్యవేక్షించాలని కమిషనర్ సూచించారు. ప్రజారోగ్యానికి హానికరమైన దోమల సంతాన ఉత్పత్తిని అడ్డుకునేలా డ్రైను కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పూడికతీత పనులను నిర్వహించాలని అధికారులు, సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అమరేంద్రనాథ్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి, సచివాలయం కార్యదర్శులు, పారిశుద్ధ్య విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

 

Read Previous

ఆర్మీ నియామకాల దరఖాస్తులకు ఆహ్వానం – కమిషనర్ జాహ్నవి

Read Next

నెల్లూరు జేసీగా బాధ్యతలు చేపట్టిన కూర్మనాథ్…

Leave a Reply

Your email address will not be published.