ముగురు కాలువలో దిగి వైసీపి ఎమ్మెల్యే కోటంరెడ్డి నిరసన…

Clock Of Nellore ( Nellore ) – ప్రతిపక్షం కాదు… అధికారం కాదు… తాను ఎప్పుడైనా ప్రజా పక్షమని మరో సారి నిరూపించుకున్నారు నెల్లూరు రూరల్ వైసీపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అధికారం లేదని గతంలో బెంగ లేదు, అధికారం ఉందని నేడు అహంకారం లేదు… తాను ప్రజలకు జవాబుదారీని అని అంటున్నారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో వైసీపి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నెల్లూరు ఉమ్మారెడ్డిగుంట ప్రాంతంలో వంతెన నిర్మాణం కోసం మురుగు గుంతలో దిగి అధికారులపై నిరసన తెలిపి వంతెనను సాధించిన ఆయన తాజాగా వైసీపి అధికారంలో ఉన్నా అధికారుల తీరును నిరసిస్తూ అదే ప్రాంతంలో మరో సారి మురుగు కాలువలోకి దిగి సంచలనం సృష్ఠించారు. ఉమ్మారెడ్డి గుంట ప్రాంతంలో రైల్వే ట్రాక్ పక్కనే నివాసాలు ఉన్నాయి. అయితే అక్కడ మురుగు నీరు విపరీతంగా ప్రవహిస్తూ ఇళ్లల్లోకి వస్తుండటంతో స్థానికులు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దృష్ఠికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన గతంలో కార్పొరేషన్ అధికారులు, రైల్వే అధికారులతో చర్చించి డ్రైనేజీని నిర్మించాలని కోరారు. గత ఏడాది నవంబర్ లోగానే పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. ఇటీవల ఇదే విషయాన్ని కార్పొరేషన్, రైల్వే అధికారులను అడగ్గా ఒకరిపై ఒకరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రైల్వే అధికారులు అనుమతి ఇవ్వడం లేదని కార్పొరేషన్ అధికారులు, కార్పొరేషన్ అధికారులు స్పందించడం లేదని రైల్వే అధితారులు చెప్పారు.

ఇక చేసేది లేక మంగళవారం ఉదయం ఉమ్మారెడ్డి గుంటకు చేరుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మురుగు కాలువలో దిగి నిరసన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకూ కదిలేది లేదని స్పష్టం చేశారు. స్థానికి సిపిఎం నేతలు కూడా ఆయనకు మద్దతుగా నిలిచారు. విషయం తెలుసుకున్న కార్పొరేషన్, రైల్వే అధికారులు ఎమ్మెల్యే వద్దకు చేరుకున్నారు. నెల రోజుల్లోగా పనులు పూర్తి చేస్తామని చెప్పగా ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు. నోటి మాట కాదని, లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని కోరగా అధికారులు లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చారు. దీంతో కోటంరెడ్డి నిరసన విరమించారు. అనంతరం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు తాను జవాబుదారీనని చెప్పారు. తనకు ఓట్లు వేసిన ప్రజలకు తనను ప్రశ్నించే హక్కు ఉందని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను ఏదైనా చేస్తానని స్పష్టం చేశారు.

 

Read Previous

పెన్నానది బావుల్లో పూడికతీత పనులు చేపట్టండి… అధికారులకు కమిషనర్ ఆదేశం

Read Next

ఆర్మీ నియామకాల దరఖాస్తులకు ఆహ్వానం – కమిషనర్ జాహ్నవి

Leave a Reply

Your email address will not be published.