దద్దరిల్లిన నెల్లూరు రూరల్ వైసీపి ప్లీనరీ సమావేశం… హాజరైన మంత్రి కాకాణి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం శనివారం ఘనంగా జరిగింది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు మాగుంట లే అవుట్ లోని సిపిఆర్ కళ్యాణ మండపంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సమావేశానికి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావు, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, విజయడైరీ ఛైర్మైన్ కొండ్రెడ్డి రంగారెడ్డి తదితరులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ముందుగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చిన తనకు 30 ఏళ్ల పోరాటం తర్వాత వైసీపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారని, రూరల్ ప్రజలు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని హామీ ఇచ్చారు. సిఎం జగన్ ఇచ్చిన బాధ్యతను తూచా తప్పకుండా పాటిస్తూ, జనానికి జవాబు దారీగా ఉంటూ, పార్టీ ప్రతిష్ఠను పెంచుతానని స్పష్టం చేశారు. వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ సిఎం జగన్ పాలనకు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే గీటురాయి అని అన్నారు. వందకి వంద శాతం స్థానాలను వైసిపిని గెలిపించి పార్టీకి అండగా ఉన్నామని ప్రజలు తెలియజేశారన్నారు. నెల్లూరు రూరల్ లో ప్రతి పక్ష పార్టీ పోటీ చేయాలంటేనే భయపడుతుందని గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ లో ఎవరికీ ఏ సమస్య వచ్చినా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వెంటనే స్పందిస్తుందని పార్టీలకు అతీతంగా తాము పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.

మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేసిన ఘనత సిఎం జగన్ కే దక్కుతుందని అన్నారు. చంద్రబాబు హయాంలో ఒక్క హామీ కూడా నెరవేరలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, జగన్ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని, పార్టీలకు అతీతంగా అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, ప్రతిపక్ష పార్టీ పనిగట్టుకుని అమ్మ ఒడిపై అసత్య ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో జిల్లాలో మరో సారి వైసీపి క్లీన్ స్వీప్ చేసి చరిత్ర తిరగరాయాలన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి ఎమ్మెల్యే ఉండటం రూరల్ ప్రజలు చేసుకున్న అదృష్ఠమని కొనియాడారు. నిత్యం ప్రజల్లో ఉండే శ్రీధర్ రెడ్డికి సోదరుడు గిరిధర్ రెడ్డి అదనపు బలం అని పేర్కొన్నారు.

Read Previous

జగన్ చరిష్మా ముందు ఎవ్వరైనా దిగదుడుపే : ఆనం విజయకుమార్ రెడ్డి

Read Next

తిరుమల వ‌సంత‌మండ‌పంలో ” అర‌ణ్య‌కాండ‌ పారాయ‌ణ దీక్ష ” ప్రారంభం

Leave a Reply

Your email address will not be published.