Clock Of Nellore ( Nellore ) – కార్పొరేషన్ సిబ్బంది ఇంటింటికి వచ్చి చెత్తను సేకరించకుండానే పన్నులు వసూలు చేస్తున్నారని తన దృష్ఠికి వచ్చిందని ఇకపై చెత్త సేకరిస్తేనే పన్నులు చెల్లించాలని మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చెత్తపై అతి తక్కువ పన్ను వసూలు చేసేది నెల్లూరు కార్పొరేషన్ అని వెల్లడించారు. గురువారం ఆయన నగరంలోని 11వ డివిజన్ పరిధిలో ఉన్న సరస్వతి నగర్, రాయపుపాళెం, ఎన్టీఆర్ నగర్ ప్రాంతాల్లో పర్యటించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే అనీల్ మీడియాతో మాట్లాడారు. నిరుపేదల నుండి నెలకు కేవలం 30 రూపాయలు మాత్రమే చెత్త పన్ను వసూలు చేస్తున్నామని చెప్పారు. అంటే రోజుకు రూపాయ చొప్పున చెత్త పన్ను వసూలు చేస్తున్నట్లు లెక్క అని వివరించారు. అయితే కార్పొరేషన్ సిబ్బంది రోజూ చెత్త సేకరించకుండా అప్పుడప్పుడు మాత్రమే సేకరిస్తున్నట్లు చాలా మంది తన దృష్ఠికి తీసుకొచ్చారని, చెత్త సేకరించిన రోజుకే పన్ను చెల్లించాలని, చెత్త సేకరించని రోజుకు కట్టాల్సిన పనిలేదన్నారు. కమిషనర్ స్థాయి నుండి కింది స్థాయి సిబ్బంది వరకూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు. బాధ్యతగా పనిచేయకపోతే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ కార్పొరేటర్ గోతం అరుణ, ఇతర కార్పొరేటర్లు కిన్నెర ప్రేమ్ కుమార్, ఊటుకూరు నాగార్జున, వైసీపి నేతలు గోతం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
