Clock Of Nellore ( Nellore ) – సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకుంటున్న వైసీపి… క్షేత్ర స్థాయిలో ప్రజలు పడుతున్న బాధలు తెలుసుకోవడం లేదని నెల్లూరు నగర జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ధ్వజమెత్తారు. నిరుపేదలకు కూడా పెన్షన్ రావడం లేదని అన్నారు. వైసీపి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా 5వ రోజు ఆయన మైపాడు రోడ్డు మధురా నగర్ లో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ కర పత్రాలను అందజేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని ఆదరించాలని కోరారు. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేసుకుంటేనే సామాన్యుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. స్థానిక ప్రజలు కేతంరెడ్డి వినోద్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వినోద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజాబాటలో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వింటుంటే ఎంతో బాధగా ఉందన్నారు. మధురానగర్ మొదటి వీధిలో ఓ వృద్దురాలు తనకు వస్తున్న పెన్షన్ ను నిలిపివేశారని, ఎన్నిసార్లు సచివాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. అవ్వా తాతలకు ఇదే ముఖ్యమంత్రి ఇస్తున్న బహుమతి అని నిలదీశారు. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉందని అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో వైసీపి ఎమ్మెల్యేలు చేపడుతున్న కార్యక్రమాల్లో సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్ఠి సారించాలని విజ్ఞప్తి చేశారు. సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పుకునే ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయిలో జరిగే వాస్తవాలను గుర్తించాలని సూచించారు.
