రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా : నెల్లూరులో కలెక్టర్ వెల్లడి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు సన్నద్ధమవుతున్న రైతన్నకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం జమ చేసిన రైతు భరోసా నగదు ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. సోమవారం ఏలూరు జిల్లా నుంచి వైఎస్సార్ రైతు భరోసా – పిఎం కిసాన్ నిధులను ముఖ్యమంత్రి జగన్ రైతుల ఖాతాల్లో జమచేసిన కార్యక్రమంలో కలెక్టర్ నెల్లూరు కస్తూర్భా కళాక్షేత్రం నుండి వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన సమయంలో సోమశిల, కండలేరు జలాశయాలను మన జిల్లాలోనే ఉంచి జిల్లా రైతాంగానికి ముఖ్యమంత్రి ఎంతో మేలు చేశారని, ఈ వ్యవసాయ సీజన్ కు ముందుగానే నీటిని విడుదల చేయాలని నిర్ణయించడం, రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను జమ చేయడం ముఖ్యమంత్రికి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఒకవైపు దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత ఉన్నా రాష్ట్రంలోని రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్, ఆక్వా రైతులకు సబ్సిడీపై విద్యుత్తును ముఖ్యమంత్రి అందిస్తున్నారని, రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, యంత్ర పరికరాలు మొదలైన సేవలను రైతు భరోసా కేంద్రంగా సకాలంలో అందజేస్తున్నామని చెప్పారు.

అసని తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు వీలైనంత త్వరలోనే నష్టపరిహారాన్ని వారి ఖాతాలో జమ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. జిల్లాలో వైయస్సార్ రైతు భరోసా – పిఎం కిసాన్ నాలుగో ఏడాదికి సంబంధించి మొదటి విడత నగదును 2,05,587 మంది రైతుల ఖాతాల్లోకి రూ. 113 కోట్లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా జమ చేసినట్లు పేర్కొన్నారు. నాలుగో ఏడాది మొదటి విడత రూ. 7500కు సంబంధించి నేడు 5500 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని, పీఎం కిసాన్ కింద ఈనెలాఖరులో మరో రెండు వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి ముందుగా కస్తూర్బా కళాక్షేత్రం ప్రాంగణంలో వ్యవసాయ శాఖ ఏర్పాటుచేసిన కూరగాయలు, యంత్ర పరికరాల స్టాళ్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ స్రవంతి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రాజు, అసిస్టెంట్ డైరెక్టర్ అనిత, మత్స్య, పశుసంవర్ధక శాఖల జాయింట్ డైరెక్టర్లు నాగేశ్వర రావు, మహేశ్వరుడు, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస రావు, ఏపీఎంఐపి అధికారి సి సుభాని, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Read Previous

కావలి ముసునూరు చెరువులో వ్యక్తి అనుమానస్పద మృతి…

Read Next

ప్రమాదకర వ్యాధులకు మూలం రక్తపోటు : మెడికవర్ వైద్యుల వెల్లడి

Leave a Reply

Your email address will not be published.