Clock Of Nellore ( Muthukur ) – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా రాష్ట్రంలోని ఏ ఒక్క రైతు కంటతడి పెట్టకుండా కృషి చేస్తానని కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ముత్తుకూరు మండల కేంద్రంలో ఆదివారం రాత్రి పర్యటించారు. ఈ సందర్భంగా అభిమానులు, వైసీపి కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై, బ్రహ్మ దేవం గ్రామం వద్ద భారీగా స్వాగతం పలికి బాణాసంచా పేలుళ్ళతో ముత్తుకూరులోని సభావేదిక వరకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ సభ లో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి మంత్రిగా సేవచేసే అవకాశం కలిగినప్పటికీ, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, వారి రుణం తీర్చుకునేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానన్నారు. దేశ చరిత్ర లోనే ఎన్నడూ లేని విధంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికి దక్కుతుందన్నారు.

రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వందేనన్నారు. రాష్ట్రంలోని సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులను పరిశీలించి తమ తమ రాష్ట్రాలలో అమలు చేసేందుకు పొరుగు రాష్ట్రాలు ఉత్సుకత చూపిస్తున్నాయని, ఇది ముఖ్యమంత్రి పరిపాలనా దక్షతకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలోని మరే నియోజకవర్గంలో లేని విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో 18 వేల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని రోడ్లను సిమెంట్ రోడ్లు గా మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ప్రతి ఇంటికి మంచి నీటి కుళాయి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం అభిమానులు మంత్రిని గజమాలతో సత్కరించారు.
