Clock Of Nellore ( Nellore ) – మహిళలను గౌరవించడం, వారికి సమాన హక్కులు కల్పించడం, ప్రోత్సహించడం వంటి మార్పులు మన ఇంటి నుంచే మొదలు కావాలని నెల్లూరు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హరేంధిరప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో మహిళల పాత్ర కీలకమని, మహిళలను గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చిన్నప్పటినుంచే ఆడపిల్లల పట్ల చిన్న చూపు చూడడం, తక్కువ చేసి చూపడం, అబ్బాయిలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్లే సమాజంలో ఇంకా లింగవివక్ష భేదం కనిపిస్తుందన్నారు. ఇలాంటి విధానానికి స్వస్తి పలికి ఆడపిల్లలకు సమాన హక్కులు కల్పిస్తే దేశం మరింత అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రోత్సహిస్తుందని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇల్లు – నవరత్నాలు పథకంలో ఇంటి పట్టాలను మహిళల పేరుతోనే అందజేయడం జరిగిందని, వైయస్సార్ ఆసరా, జగనన్న తోడు, జగనన్న చేదోడు, వైయస్సార్ చేయూత, అమ్మ ఒడి వంటి పథకాలు మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, అలాగే దిశ చట్టం మహిళలకు మరింత భద్రత కల్పించిందని, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా మహిళలకు అన్ని విధాల అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్న ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే జిల్లా అభివృద్ధిలో మహిళా ఉద్యోగినుల పాత్ర అమోఘం అన్నారు. ఒకపక్క కుటుంబాన్ని చూసుకుంటూ మరోపక్క ప్రభుత్వ విధులను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు.

జాయింట్ కలెక్టర్ రోజ్ మాండ్ మాట్లాడుతూ సమాజంలో మహిళల పాత్రను కించపరిచేలా పలు టీవీ ఛానళ్లలో ప్రదర్శితమవుతున్న సీరియళ్లను చూడొద్దని మహిళలకు సూచించారు. ఇంట్లో ఇల్లాలు బాగుంటే ఆ ఇల్లు చాలా బాగుంటుందని, అలాగే ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఆశీర్వదిస్తారనే నానుడిని నిజం చేస్తూ మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చూపాలని ఆకాంక్షించారు. జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేయడం శుభపరిణామమన్నారు. అలాగే అన్ని పాశ్చాత్య దేశాలు కూడా మన దేశ సంస్కృతి, సంప్రదాయాల వైపు చూస్తున్నాయని, అందుకనుగుణంగా మహిళలు తమకు అందివచ్చిన అవకాశాలను వినియోగించుకొని దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన మహిళలను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సెట్నల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలైన మహిళా ఉద్యోగులు, విద్యార్థినులకు ఈ సందర్భంగా ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందజేశారు.