Clock Of Nellore ( Chennai ) – తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఓ వ్యాఖ్య పెద్ద దుమారాన్నే రేపింది. అన్నా డిఎంకే పార్టీకి చెందిన ఎంపి షణ్ముగన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ నటి నయనతార పేరును ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. తమిళనాడులో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ అన్నా డిఎంకే నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎంపి షణ్ముగం పాల్గొన్నారు. విల్లుపురంలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో ఎంపి ప్రసంగిస్తూ మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టడంలో డిఎంకే ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అదే క్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ఇటీవల విద్యార్ధుల కోసం రూపొందించిన నూతన పథకం ” టెల్ యువర్ డ్రీమ్ “ పై వ్యంగ్యంగా మాట్లాడారు. నాకు నయనతార కావాలి… నా కలను ముఖ్యమంత్రి స్టాలిన్ నెరవేరుస్తారా ? అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. మహిళలను అవమానించేలా మాట్లాడారని పలువురు మండిపడ్డారు. వివాదం ముదరడంతో ఎంపి షణ్ముగం క్షమాపణలు చెప్పారు. ప్రసంగ సమయంలో పొరపాటుగా నటి పేరు ప్రస్తావించానని, అందులో ఎలాంటి దురుద్దేశం లేదని వివరణ ఇచ్చారు.