Clock Of Nellore ( Nellore ) – గతంలో ఎప్పుడూ లేని విధంగా నెల్లూరులో చెలరేగిపోతున్న రౌడీ షీటర్ల ఆగడాలు, దౌర్జన్యాలు, హత్యాకాండలపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. నెల్లూరుజిల్లా ఎస్పీ కృష్ణకాంత్ కు ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. రౌడీ షీటర్ల రహిత నెల్లూరుజిల్లాగా మార్చాలని ఆదేశాలిచ్చింది. రౌడీ షీటర్లకు మద్దతు పలికే పొలిటికల్ లీడర్స్ సిఫార్సులను పట్టించుకోవద్దని డిజిపి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాలతో రంగంలోకి దిగిన నెల్లూరులోని అన్నీ పోలీసు స్టేషన్ల అధికారులు రౌడీ షీటర్ల బెండు తీసే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. గూడూరుకు చెందిన రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ పై బయటకు వచ్చి లేడీ డాన్ అరుణతో కలిసి చేసిన అరాచకపర్వం వెలుగుచూడటంతో మొత్తం రౌడీ షీటర్ల ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. జిల్లాలోని అన్నీ పోలీసు స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను స్టేషన్ కు పిలిపించుకుని ప్రత్యేకంగా విచారిస్తున్నారు. ఆయా రౌడీ షీటర్లకు ఎవరెవరితో సంభందాలు ఉన్నాయి, ఇప్పటి వరకూ ఎలాంటి నేరాలకు పాల్పడ్డారు అనే డేటాను సేకరిస్తున్నారు. ఇటీవల నెల్లూరు నగరంలో చోటుచేసుకున్న హత్యోదంతాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. మద్యం మత్తులో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని లేపేస్తే డబ్బే డబ్బు అని కొందరు రౌడీ షీటర్ల సంభాషణలను కూడా పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. శ్రీధర్ రెడ్డిని లేపేస్తే డబ్బే… డబ్బు… అని అన్న రౌడీ షీటర్లతో పాటూ వారి పక్కన ఉన్న మిగతా రౌడీ షీటర్లకు పోలీసులు తమదైన శైలి ట్రీట్ మెంట్ ఇచ్చి జైలుకు పంపారు. వేదాయపాళెం పోలీస్ స్టేషన్ లో వరుస హత్యకాండలకు పాల్పడ్డ కొందరు రౌడీ షీటర్లపై గంజాయి కేసులు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు. రెండు రోజుల క్రితం నెల్లూరు వెంకటేశ్వరపురంకు చెందిన ఐదు మంది రౌడీ షీటర్లపై కూడా బిట్రగుంట పోలీస్ స్టేషన్ లో గంజాయి కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. తాజాగా వెంకటేశ్వరపురంకే చెందిన మరో రౌడీ షీటర్ పై పిడి యాక్టు నమోదు చేసి జైల్లోకి నెట్టారు పోలీసులు. కొందరు రౌడీ షీటర్లకు మద్దతుగా అధికార పార్టీ నేతలు పోలీసులకు ఫోన్ చేయగా సారీ సార్… ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు అంటూ సున్నితంగా చెబుతుండటంతో నేతలు కూడా రౌడీ షీటర్ల వ్యవహారంలో తలదూర్చడం లేదు. మరి కొందరు రౌడీ షీటర్లు నెల్లూరు జిల్లాను వదిలి హైదరాబాద్ కు పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొత్తం మీద దౌర్జన్యాలకు, బెదిరింపులకు, హత్యోదంతాలకు పాల్పడుతున్న రౌడీ షీటర్లకు బెండు తీసి, జైల్లోకి తోస్తున్నారు నెల్లూరు పోలీసులు. దీనిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.