Clock Of Nellore ( Nellore ) – మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరుజిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఆయన్ను వెంకటగిరి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ ను విధించారు. దీంతో పోలీసులు ఆయన్ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. సైదాపురం మండలంలోని రుస్తుం మైన్స్ లో వందల కోట్ల విలువైన క్వార్డ్జ్ ఖనిజాన్ని అక్రమంగా తవ్వి తరలించారన్న కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏ4 నిందితునిగా ఉన్నారు. అలాగే ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, మైనింగ్ కోసం పేలుడు పదార్ధాలు వినియోగించారన్న అభియోగం కూడా ఉంది. ఈ కేసులో ముద్దాయిగా చేర్చిగా అరెస్టు నుండి తప్పించుకునేందుకు కాకాణి గోవర్ధన్ రెడ్డి గత రెండు నెలలుగా పరారీలో ఉన్నారు. ఎట్టకేలకు ఆయన బెంగుళూరులోని ఓ రిసార్ట్స్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆదివారం సాయంత్రం బెంగుళూరులోని రిసార్ట్స్ లో కాకాణి గోవర్ధన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని నెల్లూరుకు తీసుకొచ్చారు. ఆదివారం రాత్రి ఆయన్ను నెల్లూరులోని పోలీసు ట్రైనింగ్ సెంటర్ ఉంచిన పోలీసులు, సోమవారం ఉదయం వెంకటాచలంలోని ప్రాధమిక వైద్యశాలకు తరలించి అక్కడ వైద్య పరీక్షలు చేయించారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని నిర్ధారణ కావడంతో పోలీసులు ఆయన్ను వెంకటగిరి కోర్టుకు తీసుకెళ్లారు. న్యాయమూర్తి విష్ణు వర్మ ముందు ప్రవేశపెట్టి రిమాండ్ విధించాలని విజ్ఞప్తి చేశారు. కోర్టులో సుమారు గంట పాటూ వాదనలు సాగాయి. చివరకు న్యాయమూర్తి ప్రాసిక్యూషన్ వైపు మొగ్గు చూపి కాకాణి గోవర్ధన్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ ను విధంచారు. దీంతో ఆయన్ను నెల్లూరులోని సెంట్రల్ జైలుకు తరలించారు. మరో వైపు వైసీపి నేతలు అనీల్ కుమార్ యాదవ్, కిలివేటి సంజీవయ్య, నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, తిరుపతి ఎంపి గురుమూర్తి తదితరులు వెంకటగిరి కోర్టు వద్దకు చేరుకుని అరెస్టును తప్పుబట్టారు.
