ఇక అరెస్టే తరువాయి…. ! వైసీపి నేత కాకాణికి సుప్రీం కోర్టులో చుక్కెదురు… !

Clock Of Nellore ( Nellore ) – అనుమతి లేని క్వారీలో క్వార్డ్జ్ ను అక్రమంగా తవ్వడమే కాకుండా, భారీ ఎత్తున పేలుడు పదార్ధాలు వినియోగించిన కేసులో ముద్దాయిగా ఉన్న మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. అరెస్టు భయంతో గత రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించగా పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది. కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టు కావడం మినహా ఆయన వద్ద ఇంకేమి ప్రత్యామ్నాయం లేదు. వివరాల్లోకి వెళితే నెల్లూరుజిల్లా సైదాపురం మండలంలో సుమారు వందకు పైగా గనులు ఉన్నాయి. కొంత మందికి సొంత గనులు ఉండగా, ఇంకొంత మంది ప్రభుత్వం నుండి గనులను లీజుకు తీసుకుని మైనింగ్ చేసే వారు. ఈ క్రమంలో 2019 – 2024 మధ్య కాలంలో సైదాపురంలో అనుమతి లేని గనుల్లో పెద్ద ఎత్తున క్వార్డ్జ్ ( తెల్లరాయి ) తవ్వకాలు చేపట్టి వందల కోట్ల రూపాయల తెల్లరాయిని విదేశాలకు తరలించారు. ఈ మొత్తం వ్యవహారం వైసిపి నేతల కనుసన్నల్లోనే సాగినట్లు ప్రచారం. మరో వైపు మాజీ మంత్రి, ప్రస్తుత వైసీపి నెల్లూరుజిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి నాయకత్వంలోనే ఈ అక్రమ మైనింగ్ జరిగినట్లు ఇటీవల గనుల శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. గనుల శాఖ నివేదిక ఆధారంగా పొదలకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏ4 ముద్దాయిగా ఉన్నారు. అనుమతి లేని క్వారీలో అక్రమంగా మైనింగ్ చేయడమే కాకుండా, మైనింగ్ లో భారీ ఎత్తున పేలుడు పదార్ధాలు వినియోగించారని కూడా పోలీసులు కేసులో పేర్కొన్నారు. పేలుళ్ల కారణంగా తమ ఇళ్లు బీటలు వారుతున్నాయని స్థానిక గిరిజనులు కాకాణి గోవర్ధన్ రెడ్డి అడగ్గా, వారిని కాకాణి గోవర్ధన్ రెడ్డి బెదిరించారని ఆ కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టును కూడా జత చేశారు.

కేసు నేపద్యంలో తనను అరెస్టు చేస్తారని భావించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి రెండు నెలల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కేసును కొట్టి వేయాలని హైకోర్టును ఆశ్రయించగా కోర్టు దానికి నిరాకరించింది. తర్వాత హైకోర్టులోనే ముందస్తు బెయిల్ పిటిషన్ ను దాఖలు చేయగా కోర్టు దాన్ని కూడా తిరస్కరించింది. ఇక చేసేది లేక అజ్ఞాతంలోనే ఉంటూ ముందస్తు బెయిల్ కోసం ఇటీవల సుప్రీం కోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. ఆ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం బెయిల్ పిటిషన్ విచారించింది. ఏపి ప్రభుత్వం తరపున న్యాయమూర్తి వాదనలు వినిపిస్తూ ముద్దాయి కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ చేశారని, దాని వల్ల ప్రభుత్వానికి వందల కోట్లు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అనుమతి లేని క్వారీలో మైనింగ్ చేయడమే కాకుండా, మైనింగ్ కు పేలుడు పదార్ధాలు వినియోగించారని, ప్రశ్నించిన గిరిజనులను చంపేస్తామంటూ బెదిరించారన్నారు. విచారణ కోసం ఎన్ని సార్లు నోటీసులు ఇచ్చినా అందుబాటులో లేరని, ప్రస్తుతం పరారీలో ఉన్నారన్నారు. ఆయనకు గతంలో నేర చరిత్ర కూడా ఉందని న్యాయవాది పలు కేసులను ప్రస్తావించారు. ఇదే క్రమంలో న్యాయమూర్తి… పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. విచారణ సహకరించకుండా ఉంటే ముందస్తు బెయిల్ ఎలా ఇస్తామని ప్రశ్నించారు. దీనిపై వాదనలు కూడా అనవసరం అని ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టేస్తున్నామని అడగ్గా, పిటిషన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి తరపు న్యాయవాది పిటిషన్ ను వాపసు తీసుకుంటామని అభ్యర్ధించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి వాపసు తీసుకునేందుకు తాము అంగీకరించమన చెబుతూ ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టి వేశారు.

Read Previous

మామిడి పండ్లలో కాల్షియం కార్బైడ్ : తనిఖీలు చేపట్టిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

Read Next

రక్తపోటును అదుపులో ఉంచుకుంటే గుండె సమస్యలు దూరం : మెడికవర్ వైద్యులు

Leave a Reply

Your email address will not be published.