Clock Of Nellore ( Nellore ) – ఒరిస్సాలో గంజాయిని కొనుగోలు చేసి నెల్లూరులో విక్రయిస్తున్న ముఠాను సంతపేట పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 2లక్షల 50వేలు విలువైన 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం సంతపేట పోలీసు స్టేషన్ లో నగర డిఎస్పీ సింధు ప్రియ విలేకరుల సమావేశం నిర్వహించి ముద్దాయిల వివరాలను వెల్లడించారు. నెల్లూరు ప్రగతి నగర్ కు చెందిన షేక్ హుస్సేని, షేక్ రఫి, నారాయణరెడ్డిపేటకు చెందిన నాపర్తి భాను ప్రకాష్, వెంకటేశ్వరపురంకు చెందిన పూడి వంశీకృష్ణ అనే నలుగురు వ్యక్తులు ఒరిస్సాకు చెందిన రంజిత్ నాయక్ అనే వ్యక్తితో కుమ్మక్కయ్యి ఒరిస్సా నుండి గంజాయిని కొనుగోలు చేసి నెల్లూరులో విక్రయిస్తున్నారు. యువతకు గంజాయిని వ్యసనంగా చేసి డబ్బు సంపాదిస్తున్నారు. వీరి కదలికలపై అనుమానంతో సంతపేట పోలీసులు వారిపై నిఘా ఉంచారు. పొర్లుకట్ట ప్రాంతంలో గురువారం వారు గంజాయిని విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ సింధు ప్రియ వెల్లడించారు. గంజాయి ముఠాను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబర్చిన సంతపేట సిఐ దశరథ రామారావు, ఎస్సై భాలకృష్ణ సిబ్బందిని అభినందించారు.