Clock Of Nellore ( Nellore ) – తన రైస్ మిల్ తో సహా ఆక్వా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను కబ్జా చేసేందుకు యత్నించి తనపై హత్యాయత్నానికి పాల్పడ్డ నిందితులపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇందుకూరుపేట మండలం, ఆదెమ్మ సత్రంకు చెందిన మద్దినేని రవీంద్ర బాబు కోరారు. శుక్రవారం నెల్లూరులోని జర్నలిస్టు భవన్ లో రవీంద్ర బాబు విలేకరులు సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆదెమ్మ సత్రంలో తనకు శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్ తో సహా సవ్య ఆక్వా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందని పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా అదే ప్రాంతానికి చెందిన శ్రీధర్, సత్యం నాయుడు, కాసా మధునాయుడు, రాజేష్, మౌర్య అనే వారు తన రైస్ మిల్లును, ఆక్వా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈనెల 10వ తేదీనా తాను రైస్ మిల్లులో పురుగుల మందు కొడుతుండగా పై వ్యక్తులు అడ్డుకుని తనపై దాడి చేయడంతో పాటూ హత్యాయత్నానికి పాల్పడ్డారని వెల్లడించారు. ప్రాణ భయంతో తాను తప్పించుకుని ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసి వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లానన్నారు. తనపై హత్యాయత్నం చేసిన వ్యక్తులపై ఇప్పటి వరకూ పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం పోలీసులు స్పందించి వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే తన ఆస్తులకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు.