Clock Of Nellore ( Nellore ) – వైసీపి నేత, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి ఆ పార్టీకి ఝలక్ ఇచ్చారు. వైసీపిని వీడాలని నిర్ణయించుకున్నారు. తండ్రి బల్లి దుర్గా ప్రసాద్ ఆశయ సాధనకు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు. మరో వైసీపి ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీతో కలిసి ఇవాళ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు కళ్యాణ చక్రవర్తి. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో పాటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు. టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి బల్లి దుర్గా ప్రసాద్ 2019 ఎన్నికల్లో టిడిపిలో టికెట్ దక్కకపోవడంతో అనూహ్యంగా వైసీపిలో చేరి తిరుపతి ఎంపిగా విజయం సాధించారు. కొద్ది కాలానికే కరోనాతో ఆయన కన్నుమూశారు. దీంతో జగన్మోహన్ రెడ్డి తిరుపతి స్థానాన్ని గురుమూర్తికి కేటాయించి, బల్లి దుర్గా ప్రసాద్ కుమారుడైన బల్లి కళ్యాణ చక్రవర్తికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపి ఘోర పరాజయం పాలవడంతో ఆ పార్టీలోని నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి కూడా తన రాజకీయ భవిష్యత్తును దృష్ఠిలో ఉంచుకుని టిడిపిలో చేరాలని నిర్ణయించుకున్నారు. వైసిపిలో రాజకీయ భవిష్యత్తు అనుమానమేనని భావించిన బల్లి కళ్యాణ చక్రవర్తి… టిడిపి నేతలతో మంతనాలు జరిపారు. టిడిపిలో చేరాలనుకునే వారు వైసీపి ద్వారా వచ్చిన వారి పదవులకు రాజీనామా చేసి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల చెప్పిన నేపద్యంలో… బల్లి కళ్యాణ చక్రవర్తి కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం మధ్యాహ్నం శాసన మండలి ఛైర్మైన్ ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అలాగే వైసీపికి కూడా రాజీనామా చేశారు. తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరనున్నారు. నెల్లూరుజిల్లాకు చెందిన వైసీపి రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు కూడా ఎంపి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన కూడా త్వరలో టిడిపిలో చేరనున్నారు.