వేమిరెడ్డి రాకతో వైసీపి మొత్తం ఖాళీ : చంద్రబాబు ప్రసంగం

Clock Of Nellore ( Nellore ) – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాకతో నెల్లూరుజిల్లాలో వైసిపి మొత్తం ఖాళీ కాబోతుందని, ఇప్పటికే 90 శాతం ఖాళీ అయిందని, ఎన్నికల నోటిఫికేషన్ రాగానే మిగిలిన 10 శాతం కూడా ఖాళీ అవుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నెల్లూరులోని విపిఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు సమక్షంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటూ ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఇతర నియోజకవర్గాలకు చెందిన వందలాది మంది టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాలకు గౌరవం తెచ్చే వారని, అందుకే తానే నెల్లూరుకు వచ్చి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించానని చెప్పారు. వేమిరెడ్డి రాకతో వైసీపి ఖాళీ కావడం ఖాయమని పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో సింహపురి రాజకీయం ప్రత్యేకమని, ఇక్కడి నేతలు ఆత్మగౌరవంతో ఉంటారని వెల్లడించారు. అందుకే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లు జగన్ వేధింపులు భరించలేక వైసీపిని వీడారని అన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్ ను ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. అనుమానమే లేదు… వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం – జనసేన కూటమి విజయం ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ పై చంద్రబాబు సెటైర్లు వేశారు. మొన్నటి వరకూ ఒకాయన ఎగిరెగిరి పడ్డారని, కన్నూమిన్నూ కానరాకుండా వ్యవహరించాడని అనీల్ ను వ్యంగ్యంగా అన్నారు. బదిలీల్లో ఒక్క తన్ను తన్నితే ఎగిరి పల్నాడులో పడ్డాడని, ఆయనకు అక్కడ బుల్లెట్ దిగడం ఖాయమని అక్కడి నుండి చెన్నైకి పారిపోవడం ఖాయమని చంద్రబాబు అన్నారు.

Read Previous

టిడిపిలో చేరిక దైవ నిర్ణయం : ఎంపిగా గెలిపించాలని కోరిన విపిఆర్

Read Next

మినీ బైపాస్ లో బ్రాహ్మణ కర్మక్రతువుల భవనం : ప్రారంభించిన ఎమ్మెల్యే అనీల్

Leave a Reply

Your email address will not be published.