Clock Of Nellore ( Nellore ) – తెలుగుదేశం ప్రభుత్వం రాగానే నిరుపేదలకు 43వేల ఇళ్లను పంపిణీ చేస్తానని, నిరుపేదలు ఆర్ధికంగా ఎదిగేందుకు కృషి చేస్తానని నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. నెల్లూరు 4, 47వ డివిజన్లలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఆ ప్రాంతానికి వెళ్లిన నారాయణకు స్థానిక టిడిపి కార్యకర్తలు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గడప గడపకూ వెళ్లి ప్రజలతో మాట్లాడారు. గత టిడిపి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని తెలియజేస్తూ త్వరలో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నాారాయణ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిర్మించిన టిడ్కో ఇళ్ల కోసం లక్ష నుండి 25వేల వరకూ అర్హులు ప్రభుత్వానికి నగదు చెల్లించారని, అయితే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేళ్లు గడుస్తున్నా నేటికీ ఇళ్లు లబ్ధిదారులకు స్వాధీనం చేయలేదన్నారు. పేదలకు ఇళ్లు ఇవ్వకపోవడం దుర్మార్గమైన చర్య అని అభివర్ణించారు. టిడిపి ప్రభుత్వం రాగానే మొదటగా టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు స్వాధీనం చేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపి విజయం ఖాయమని నారాయణ స్పష్టం చేశారు.
