Clock Of Nellore ( Nellore ) – వైసీపికి గుడ్ బై చెప్పిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మార్చి 2వ తేదీనా తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈ చేరిక కార్యక్రమాన్ని నెల్లూరులో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. స్వయంగా చంద్రబాబే వేమిరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించనున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటూ ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్, పలువురు కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, ఎంపిటిసిలు, సర్పంచ్ లు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈ కార్యక్రమం నేపద్యంలో సోమవారం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి నారాయణను కలిశారు. స్వయంగా ఆయనే చింతారెడ్డిపాళెంలోని నారాయణ నివాసానికి వెళ్లగా టిడిపి జిల్లా అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్, నారాయణ ఆయనకు స్వాగతం పలికారు. 2వ తేదీ చంద్రబాబు సమక్షంలో చేరిక కార్యక్రమం ఉండటంతో కార్యక్రమ ఏర్పాట్లు, ఎక్కడ నిర్వహించాలి అనే అంశాలపై ఇరువురూ చర్చించారు. సుమారు గంట పాటూ వీరి భేటీ కొనసాగింది.
