Clock Of Nellore ( Nellore ) – జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హరినారాయణన్, నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ ల ఆదేశాలతో చికెన్ షాపులను స్వచ్ఛందంగా మూసివేయాలని, ప్రజలంతా చికెన్ ఆధారిత ఆహార పదార్థాలను భుజించవద్దని కార్పొరేషన్ ఆరోగ్యాధికారి వెంకట రమణ విజ్ఞప్తి చేశారు. అధికారులతో కలిసి చిన్న బజారు సమీపంలోని చికెన్ మార్కెట్ ను ఆయన శనివారం తనిఖీ చేశారు. నిల్వ ఉన్న చికెన్ ను స్వాధీనం చేసుకుని, షాపులను మూయించారు. జిల్లా ఉన్నతాధికారుల నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఎవరూ చికెన్ విక్రయాలు, కొనుగోలు జరపరాదని డాక్టర్ వెంకట రమణ హెచ్చరించారు. హోటళ్లు, రెస్టారెంట్ లు, బార్లు, కర్రీస్ పాయింట్లలో చికెన్ విక్రయాలు జరపడాన్ని నిషేదించామని తెలిపారు. ప్రత్యమ్నాయంగా చేపలు, మటన్, రొయ్యలు వంటి మాంసపు ఉత్పత్తులను ఆహారంగా వినియోగించుకోవాలని సూచించారు.పై ఆదేశాలను ఉల్లఘించే షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లపై దాడులు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని డాక్టర్ వెంకట రమణ హెచ్చరించారు.
