Clock Of Nellore ( Nellore ) – మేయర్ గా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కాదని నాలుగు నెలల క్రితం పొరపాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగానని, ఆ తప్పును నేడు సరిదిద్ధుకుంటూ తనకు అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి వెంటే ఉండాలని నిర్ణయించుకున్నట్లు నెల్లూరు నగర మేయర్ స్రవంతి వెల్లడించారు. గురువారం ఉదయం వైసీపి జిల్లా నేతలను కలిసిన అనంతరం ఆమె సాయంత్రం కార్పొరేషన్ కార్యాలయంలో తన ఛాంబర్ లో విలేకరులతో మాట్లాడారు. గత 4 నెలల క్రితం జరిగిన సంఘటనలు అందరికి తెలిసినవేనని, ఆ సందర్భంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత దూరంగా ఉండడం జరిగిందని, అయితే అది ఒక పొరపాటుగా భావిస్తున్నానని మేయర్ పేర్కొన్నారు. వై.యస్.ఆర్ పార్టీ పెద్దలను కలవడం జరిగిందని, వారు కూడా సహృదయంతో పార్టీలోకి ఆహ్వానం పలకడం జరిగిందని మేయర్ తెలిపారు. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, వ్యవసాయ శాఖా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, నగర శాసన సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ను కలవడం జరిగిందని, వారందరి సూచనలు, సలహాల మేరకు ముందుకు సాగుతామని మేయర్ పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపి అభ్యర్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డి విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మేయర్ స్రవంతి వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో మేయర్ భర్త జయవర్ధన్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. విలేకరుల సమావేశం అనంతరం మేయర్ దంపతులు మంత్రి కాకాణి నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రికి పుష్పగుచ్ఛం అందజేశారు.
