Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అవసరాన్ని బట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి నిధులను విడుదల చేస్తున్నారని నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. గురువారం రాత్రి 29వ డివిజన్లోని గాంధీనగర్ వీధుల్లో జరిగిన గడపగడపకు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక కార్పొరేటర్ డాక్టర్ సత్తార్ ఆధ్వర్యంలో రెండు రోడ్లకు 15 లక్షల రూపాయలతో ఎంపీ ఆదాల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే పోరాటాలు చేస్తే నిధులు విడుదల జరుగుతున్నాయని ప్రచారం చేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. అవసరాన్ని బట్టి నిధులను కోరితే సీఎం జగన్ ఇస్తున్నారని, ఆయనను అడిగే విధంగా అడిగితే ఏదీ కాదనరని స్పష్టం చేశారు. 29వ డివిజన్ కు కోటీ 20 లక్షల రూపాయలను అభివృద్ధి పనుల కోసం విడుదల చేశారని తెలిపారు. నగర రోడ్లకు 20 కోట్ల రూపాయలు, గ్రామీణ పరిధిలోని రోడ్లకు 25 నుంచి 30 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్లలో జరగని అభివృద్ధిని ఇప్పుడు చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నామన్నారు. రెండు, మూడు నెలల్లో ఈ పనులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా జిల్లా పరిషత్ నుంచి కూడా కొన్ని నిధులను అవసరానుగుణంగా వెచ్చిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ డాక్టర్ సత్తార్, కార్పొరేటర్లు ఒరిస్సా శ్రీనివాసరెడ్డి, మూలె విజయభాస్కర్ రెడ్డి, నూనె మల్లికార్జున యాదవ్, వైసీపీ నేతలు స్వర్ణ వెంకయ్య, నవీన్ కుమార్ రెడ్డి, హరిశ్చంద్రరెడ్డి, సురేష్ రెడ్డి, రియాజ్, హరిబాబు యాదవ్, సుబ్బారెడ్డి, ఏసు నాయుడు, మేఘనాథ్ సింగ్, పాశం శ్రీనివాసులు, చేజర్ల సుబ్బారెడ్డి, సాయి రెడ్డి, మదన్మోహన్ రెడ్డి, పెంచల్ రెడ్డి, జీవన్ ప్రసాద్, శివ సునీల్ రెడ్డి, జెడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
