Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరానికే కాకుండా జిల్లాకే పర్యాటక కేంద్రం, ఆథ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు, గణేష్ ఘాట్ అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారంభించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారులను కోరారు. శుక్రవారం ఆయన నెల్లూరులోని నుడా కార్యాలయానికి వెళ్లారు. నుడా వైస్ – ఛైర్మైన్ టి. బాపిరెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు పనులకు అమృత్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఉందని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు, మంత్రి నారాయణ, మేయర్ అబ్ధుల్ అజీజ్, నుడా ఛైర్మైన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిలు ఆ పనులను చాలా మేర పూర్తి చేశారని చెప్పారు. 2019లో వైసీపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా తాను అనేక ప్రయత్నాలు చేసి నెక్లెస్ రోడ్డు, గణేష్ ఘాట్ కొంత మేర అభివృద్ధి చేశానన్నారు. ఇంకా దానికి సంభందించి 17.50 కోట్లు నిధులు మిగిలి ఉన్నాయని ఆ నిధుల ద్వారా నెక్లెస్ రోడ్డు పనులు పూర్తి చేస్తే ఈ ప్రాంతం ఎంతో అహ్లాదకరంగా, పర్యాటక ప్రదేశంగా, అమ్మవారి క్షేత్రంగా మారుతుందని కోటంరెడ్డి నుడా వైస్ – ఛైర్మైన్ కు వివరించారు. 6 నెలల ముందే ఆ పనులకు టెండర్లు పూర్తి చేసినా రాష్ట్ర ప్రభుత్వం నిధుల విడుదలకు క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్ పనులు చేసేందుకు వెనకడుగువేస్తున్నారని శ్రీధర్ రెడ్డి తెలియజేశారు. మే నెల 15వ తేదీ లోగా అభివృద్ధి పనులు ప్రారంభించాలని లేదంటే అన్నీ పార్టీలతో కలిసి నుడా కార్యాలయాన్ని ముట్టడిస్తానని ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రకటించారు.
