సిఎం ఫోటో వివాదం : రసాభాసగా నెల్లూరు కార్పొరేషన్ సమావేశం

Clock Of Nellore ( Nellore ) – కౌన్సిల్ హాల్లో తనకు తెలియకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎవరు పెట్టారని మేయర్ స్రవంతి అధికారులను ప్రశ్నించడంతో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సర్వసభ్య సమావేశం రసాభాసాగా మారింది. ఓ వర్గం కార్పొరేటర్లు మేయర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మేయర్ పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. మేయర్ ను తన ఛాంబర్ కు వెళ్లనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. తన మాటలకు తప్పుగా అర్ధం చేసుకున్నారని మేయర్ వివరించగా తిరిగి సమావేశం యధావిధిగా కొనసాగింది. సమావేశం అనంతరం మేయర్ ముగ్గురు కార్పొరేటర్లపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోమవారం ఉదయం మేయర్ స్రవంతి అధ్యక్షతను కౌన్సిల్ సాధారణ సామావేశం ప్రారంభమైంది. ప్రారంభమైన కొద్ది సేపటికే వివాదం నెలకొంది. ఇంతముందెప్పుడూ లేని సిఎం జగన్ ఫోటో కౌన్సిల్ హాల్లో ఉండగా మేయర్ గమనించి సిఎం ఫోటో కౌన్సిల్ హాల్లో ఎవరు పెట్టారని అధికారులను ప్రశ్నించారు. అంతలోనే ఓ వర్గం కార్పొరేటర్లు మేయర్ వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. సిఎం జగన్ వల్లే మీరు మేయర్ స్థానంలో ఉన్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో ఏర్పాటుపై అభ్యంతరం చెప్పడం ఏంటని ప్రశ్నించారు. మేయర్ పోడియం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మేయర్ పదవికి రాజీనామా చేయాలని పలువురు కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. సభ గందరగోళంగా మారడంతో మేయర్ స్రవంతి సభను కొద్ది సేపు వాయిదా వేసి తన ఛాంబర్ కు వెళ్లేందుకు ప్రయత్నించగా కొందరు కార్పొరేటర్లు అడ్డుకున్నారు. సిఎం ఫోటో ఏర్పాటు చేయడం తనకూ ఇష్టమేనని, ఇప్పటికిప్పుడు ఎవరు పెట్టారని మాత్రమే తాను అధికారులను అడిగానని మేయర్ ఈ సందర్భంగా సభ్యులకు తెలియజేశారు. ఆమె తన ఛాంబర్ కు వెళుతున్న సమయంలో కార్పొరేటర్ మొయిళ్ల గౌరి అడ్డుకున్నారు. మేయర్ ను వెనక్కు తోసే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, కార్పొరేషన్ సిబ్బంది, కొందరు సహచర కార్పొరేటర్లు మేయర్ కు రక్షణగా ఏర్పడి ఆమెను ఛాంబర్ లోకి తీసుకెళ్లారు. పలువురు కార్పొరేటర్ల తీరుపై ఆమె మనస్థాపం చెందారు. కేవలం తాను గిరిజన మహిళ అన్న చిన్నచూపుతో కొందరు కార్పొరేటర్లు తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.

కొద్ది సేపటి తర్వాత కౌన్సిల్ సమావేశం తిరిగి ప్రారంభమైంది. సిఎం ఫోటో విషయంపై ఆమె వివరణ ఇచ్చారు. తన ఛాంబర్ లో కూడా సిఎం ఫోటో ఉందని, అలాంటప్పుడు కౌన్సిల్ హాల్లో ఉంటే తానెందుకు అభ్యంతరం చెబుతానని మేయర్ పేర్కొన్నారు. సిఎం ఫోటో కౌన్సిల్ హాల్లో పెట్టాలా… పెట్టకూడదా అనే నిబంధనలు తనకు తెలియదని అందుకే నిబంధనలు పరిశీలించాలని అధికారులకు చెప్పానన్నారు. తర్వాత కౌన్సిల్ సమావేశం యధావిధిగా కొనసాగింది. సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. పలు అంశాలపై సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కోటమిట్టలోని షాదీ మంజిల్ నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలన్న అంశంపై సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా ఆ నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్లు మేయర్ స్రవంతి ప్రకటించారు. అలాగే డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస యాదవ్ లు కార్పొరేషన్ హెల్త్ ఆధికారి వెంకట రమణపై ఫిర్యాదులు చేశారు. కార్పొరేషన్ లోని ఉన్నతాధికారులంతా ఎలక్ట్రికల్ కారులను వినియోగిస్తుంటే హెల్త్ అధికారి ఒక్కరే పెట్రోల్ కారును ఎలా వాడుతారని దానిపై చర్యలు తీసుకోవాలని బొబ్బల శ్రీనివాస యాదవ్ సమావేశ మందిరంలో ఉన్న కమిషన్ వికాశ్ మర్మట్ కు లిఖిత పూర్వక ఫిర్యాదును అందించారు. చర్చలో భాగంగా అజెండాలో పేర్కొన్న అంశాలకు సభ్యులు ఆమోదం తెలపడంతో సభ ముగిసింది.

Read Previous

ఈ నెల 22న పిఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం – శ్రీహరికోటలో సర్వం సిద్ధం

Read Next

నా మాటలను వక్రీకరించారు… సిఎం ఫోటో పెట్టడం తనకూ ఇష్టమే : స్పష్టం చేసిన మేయర్

Leave a Reply

Your email address will not be published.