మహిళల గురించి ఇంతలా ఆలోచించే సిఎం ఎక్కడా ఉండరు : మంత్రి కాకాణి

Clock Of Nellore ( Muthukur ) – మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే, ఆ కుటుంబాలు ఆర్థిక పరిపుష్టి సాధించి సంతోషంగా జీవిస్తాయని భావించిన ముఖ్యమంత్రి ప్రతి పథకంలోనూ మహిళలను భాగస్వామ్యులు చేస్తూ, వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి పేర్కొన్నారు. శనివారం ముత్తుకూరు మండల కేంద్రంలోని ఫిషరీస్ కళాశాలలో వై ఎస్ ఆర్ ఆసరా మూడో విడత నిధులు పంపిణీ కార్యక్రమంలో మంత్రి కాకాణి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అనంతరం మంత్రి కాకాణి మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలను సొంత అక్కా చెల్లెళ్ళుగా భావిస్తూ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు స్వయం సహాయక సభ్యులకు ఆసరా 3వ విడత నిధులను సీఎం విడుదల చేస్తున్నారన్నారు. జిల్లాలోని 34,440 గ్రూపులకు 826 కోట్లు మంజూరు చేసామన్నారు. అందులో సర్వేపల్లి నియోజకవర్గంనకు సంబంధించి 4056 గ్రూపులకు 91 కోట్ల 83 లక్షలు నిధులు మంజూరయ్యాయన్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఒక పధకానికి నిధులు కేటాయించడం గతంలో ఎన్నడూ లేదన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పటికే రెండు విడతలు మంజూరు చేసి ఇప్పుడు మూడో విడత నిధులు మంజూరు చేశారన్నారు.

మహిళలు కుటుంబాన్ని చక్కదిద్దటంలో ముఖ్య పాత్ర పోషిస్తారని, అటువంటి మహిళలకు ఆసరాగా ఉంటూ సహాయం అందచేస్తే అద్భుతాలు చేస్తారనే ఉద్దేశంతోనే ప్రతి పధకాన్ని మహిళల పేరుతోనే ముఖ్యమంత్రి అమలు చేస్తారన్నారు. మహిళల గురించి ఇంతలా ఆలోచించే ముఖ్యమంత్రి దేశంలోనే లేరని, వారిని ఆర్ధిక స్వాలంబన దిశగా నడిపించుటకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకుని విభిన్న తరహా జీవనోపాధులు ఎంచుకుని ఆర్ధిక సుస్థిరత సాధించాలన్నారు. అదే విధంగా సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలను విరివిగా ప్రోత్సహిస్తున్నామని, వీటి ద్వారా వారు జీవితంలో నిలదొక్కుకోవడమే కాకుండా మరింత మందికి ఉపాధి కల్పిస్తారన్నారు. అంతకుముందు మంత్రి కాకాణి స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళలు ఏర్పాటుచేసిన ఉపాధి యూనిట్లను పరిశీలించారు. అనంతరం ముత్తుకూరు మండలానికి సంబంధించిన 791 సంఘాల్లోని 7916 మంది సభ్యులకు వైఎస్ఆర్ ఆసరా 3 వ విడత మొత్తం 5 కోట్ల 78 లక్షల 11 వేల రూపాయల చెక్కును మహిళలకు అందచేశారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఏ పిడి సాంబశివారెడ్డి, ఏరియా కోఆర్డినేటర్ శ్రీనివాసులు, ఎంపీపీ గండవరం సుగుణమ్మ, స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, మహిళలు పాల్గొన్నారు.

Read Previous

నెల్లూరులో రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ కార్యాలయం – ప్రారంభించిన కలెక్టర్

Read Next

కావలి RDO కార్యాలయంలో సమావేశ మందిరం – ప్రారంభించిన కలెక్టర్

Leave a Reply

Your email address will not be published.