Clock Of Nellore ( Nellore ) – గత 40 ఏళ్ల నుండి నిలిచిపోయిన నెల్లూరు గ్రామదేవత శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి జాతరను తాను నిర్వహించేందుకు తలపిస్తే ఎన్నికల కోడ్ పేరుతో అధికారులు అనుమతులు ఇవ్వడం లేదని నెల్లూరు రూరల్ వైసీపి తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. దైవ కార్యక్రమాలకు ఎన్నికలకు సంభంధం ఏంటని ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు మహా శివరాత్రి వేడుకలు నిర్వహించలేదా అని అడిగారు. మంగళవారం నెల్లూరులోని తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జాతరపై మాట్లాడారు. మార్చి 26, 27, 28 తేదీల్లో జాతర నిర్వహణకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర దేవాదాయశాఖను కోరగా అధికారులు ఎన్నికల కోడ్ కారణంగా అనుమతులు ఇవ్వలేమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తాను వైసీపి నుండి బయటకు వచ్చిన తర్వాత జాతర నిర్వహణ అంశం తీసుకురాలేదని, గణేష్ ఘాట్ లో నిర్వహించిన కార్తీక దీపోత్సవం నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో ఆథ్యాత్మిక గురువు గరికపాటి నరసింహారావు చెప్పిందేనని గుర్తు చేశారు. అప్పుడు తాను వైసీపిలోనే ఉన్నానన్నారు. తన పేరుతో అనుమతులు అవసరం లేదని రూరల్ నియోజకవర్గ ఇంఛార్జ్ గా ఉన్న ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరుపై ఇచ్చినా అభ్యంతరం లేదన్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి అయినా జాతర నిర్వహించాలని తాను సామాన్య భక్తునిగానే పాల్గొంటానని కోటంరెడ్డి తెలియజేశారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుకుంటే గంటలో అనుమతులు వస్తాయన్నారు. 40 ఏళ్ల నుండి నిలిచిపోయిన జాతర జరిపించాలని వేడుకున్నారు. జాతర నిర్వహణ నెల్లూరు సుభిక్షానికి ఎంతో మంచిదని ఆథ్యాత్మిక గురువులు చెబుతున్నారని పేర్కొన్నారు. మార్చిలో నిర్వహించే జాతరకు ఈనెల 26న తొలి చాటింపు వేయించాల్సి ఉందని, ఈనెల 25 లోగా అనుమతి ఇవ్వాల్సి ఉందన్నారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఇంఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ లు జాతర నిర్వహణకు ముందుకొచ్చి జరిపించాలని విజ్ఞప్తి చేశారు. జాతర క్రెడిట్ తనకు అవసరం లేదని వారే తీసుకోవచ్చునని తెలియజేశారు. జాతర నిర్వహణ నెల్లూరు నగరానికి ఎంతో మంచిదని కోటంరెడ్డి వివరించారు.