పోలీసులపై ఆనం ఆగ్రహం – నెల్లూరులో రాజకీయ రగడ

Clock Of Nellore ( Nellore ) – మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో సాక్షాత్తూ జిల్లా ఎస్పీ విజయరావు రంగంలోకి దిగి ఆయనకు సర్ధి చెప్పారు. తానే స్వయంగా పరిశీలిస్తానని హామీ ఇవ్వడంతో ఆనం చల్లబడ్డారు. వివరాల్లోకి వెళితే… నెల్లూరులోని మినీ బైపాస్ రోడ్డులో శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానానికి సంభందించిన స్థలం ఉంది. ఆ దేవస్థానానికి ఆనం కుటుంబం అనువంశిక ధర్మకర్తలుగా ఉన్నారు. ఆ స్థలాన్ని కొందరు ఆక్రమించారని తెలుసుకున్న వేణుగోపాల స్వామి దేవస్థానం ఛైర్మైన, సిబ్బంది అక్కడికి వెళ్లి ఆక్రమణలను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆక్రమణ దారులు నెల్లూరులోని దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్గామిట్ట సిఐ సీతారామయ్య ఆలయ ఛైర్మైన్ తో పాటూ సిబ్బందిని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. దీనిపై ఆనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం సాయంత్రం పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఆయన వెళ్లగానే వారి సోదరులు ఆనం విజయకుమార్ రెడ్డి, ఆనం జయకుమార్ రెడ్డి, వారి అనుచరులు అక్కడకు వెళ్లారు.

ఈ క్రమంలో సిఐ సీతారామయ్యపై ఆనం ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థానం స్థలం ఆక్రమిస్తే వారిపై చర్యలు తీసుకోకపోగా, ఆలయ ఛైర్మైన్, సిబ్బందిని స్టేషన్ ఎలా పిలిపిస్తారని ప్రశ్నించారు. పరిస్థితి చేయిదాటడంతో జిల్లా ఎస్పీ విజయరావు స్టేషన్ కు చేరుకుని పరిస్థితిని సమీక్షించి ఆనంకు సర్ధిచెప్పారు. స్టేషన్ కు పిలిపించిన వారిని తీసుకొని వెళ్లాలని కోరారు. దీనిపై విచారణ జరుపుతామని చెప్పారు. మరో వైపు ఆనం రామనారాయణ రెడ్డి స్టేషన్ బయట విలేకరులతో మాట్లాడారు. నెల్లూరు ప్రజలకు తాను, తన కుటుంబం అండగా ఉంటుందని…. ఈ విషయంలో వేరే ఆలోచన లేదని స్పష్టం చేశారు. రాజకీయంగా తమను ఇబ్బంది పెట్టాల్సి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Read Previous

రామాయపట్నం పోర్టు నిర్వాసితులకు అన్నీ విధాలా సాయం : కరికాల వలెవన్

Read Next

నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ ను సందర్శించిన స్వీడన్ బృందం

Leave a Reply

Your email address will not be published.