Clock Of Nellore ( Nellore ) – నేతలంతా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఒక్క ఓటు కూడా పక్కకు వెళ్లకుండా పక్కాగా మనకే పడే విధంగా అప్రమత్తంగా ఉంటూ పనిచేయాలని, వచ్చే ఎన్నికల్లో నెల్లూరుజిల్లాలోని మొత్తం ఏడు సీట్లు కైవసం చేసుకోవాలని రాజ్యసభ సభ్యులు, వైసీపి ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయి రెడ్డి నేతలకు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం నెల్లూరు రూరల్, కోవూరు నియోజకవర్గాల నేతలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రూరల్ నియోజకవర్గ సమావేశంలో ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి, మేయర్ స్రవంతి, రూరల్ నేతలు పాల్గొనగా… కోవూరు సమీక్షలో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు. రూరల్ నియోజకవర్గంపై సిఎం జగన్ ప్రత్యేక దృష్ఠి సారించారని నేతలకు చెప్పుకొచ్చారు విజయసాయి రెడ్డి. రూరల్ నియోజకవర్గంలో ఖచ్చితంగా వైసీపి విజయం సాధించాలని దానికి ఏం కావాలన్నా ఇచ్చేందుకు సిఎం సిద్దంగా ఉన్నారన్నారు. పార్టీని బలోపేతం చేయాలన్నారు. కోవూరు నియోజకవర్గ నేతలతో కూడా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గెలుపే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. పార్టీ సూచించే ప్రతీ కార్యక్రమాన్ని నూటికి నూరు శాతం చేయాలని, సిఎం జగన్ ఎప్పటికప్పుడు మార్గనిర్ధేశం చేస్తారని విజయసాయి రెడ్డి తెలిపారు. జిల్లాలోని అన్నీ నియోజకవర్గాలపై విజయసాయి రెడ్డి సమీక్షలు నిర్వహించనున్నారు.
