
Clock Of Nellore ( Duthaluru ) – పాసు పుస్తకాల కోసం రైతు నుండి లంచం డిమాండ్ చేసి 10 వేల రూపాయలు తీసుకుంటూ నెల్లూరుజిల్లాలో ఓ విఆర్వో అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. దుత్తలూరు మండలం, సోమలరేగడ గ్రామానికి చెందిన రైతు రాధాకృష్ణ అదే గ్రామంలో ఓ రైతు వద్ద ఒక ఎకరా 30 సెంట్ల భూమిని గత ఏడాది కొనుగోలు చేశారు. అనంతరం భూ యాజమాన్య హక్కుల మార్పిడికి స్థానిక తహసీల్ధార్ కార్యాలయంలో ధరఖాస్తు చేసుకోగా అది తిరస్కరణకు గురైంది. మళ్లీ ఈ నెల 17వ తేదీనా ధరఖాస్తు చేసుకున్నారు. అయితే ధరఖాస్తు ముందుకు కదలలేదు. స్థానిక విఆర్వో రిపోర్టు రాయాల్సి ఉండగా విఆర్వో షేక్ హజరత్ మస్తాన్ రిపోర్టు రాయలేదు. దీనిపై రైతు రాధాకృష్ణ విఆర్వోను అడగ్గా లంచం డిమాండ్ చేశాడు. దీనిపై రైతు ఏసిబి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏసిబి అధికారుల సూచనల మేరకు రైతు రాధాకృష్ణ బుధవారం ఉదయం విఆర్వో హజరత్ మస్తాన్ ను దుత్తలూరు తహసీల్ధార్ కార్యాలయంలో కలిసి 10వేల రూపాయల లంచాన్ని అందజేశారు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసిబి అధికారులు విఆర్వోను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.