
Clock Of Nellore ( Nellore ) – ఆయన శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత గల పోలీసు అధికారి. దొంగలు, అవినీతి పరులు, నేరస్తుల పాలిట సింహ స్వప్నంలా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే నెల్లూరుజిల్లాలో మాత్రం ఓ పోలీసు అధికారి నేరస్తుడితో చేతులు కలిపాడు. అతనిచ్చిన ఆమ్యామ్యాకు లోబడి నేరస్తుడిపై ఉన్న కేసు తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశాడు. విషయం గ్రహించిన బాధితులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అతని బండారం బయటపడింది. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం నెల్లూరుజిల్లా కావలి రూరల్ సిఐగా పనిచేస్తున్న షేక్ ఖాజావలి గతంలో కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్ సిఐగా పనిచేశారు. ఆ సమయంలో పోర్టులో చోరీ కేసు నమోదైంది.
ఓ సంస్థ… తమకు చెందిన 43 కోట్ల రూపాయల విలువైన బొగ్గును కృష్ణపట్నం పోర్టులో ఉంచింది. దానికి ఓ వ్యక్తిని కస్టోడియన్ ( సంరక్షకుడు ) గా నియమించింది. కొన్ని నెలలు గడిచిన తర్వాత సంస్థకు తెలియకుండా కస్టోడియన్ గా ఉన్న వ్యక్తి 43 కోట్ల విలువైన బొగ్గును ఇతరులకు విక్రయించేశాడు. విషయం తెలుసుకున్న ఆ సంస్థ దానిపై కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. సంస్థకు చెందిన బొగ్గును సంస్థ ప్రమేయం లేకుండా మోసం చేసి కస్టోడియన్ అమ్మేశాడని ఫిర్యాదు చేయగా అప్పటి సిఐ ఖాజావలి కేసు నమోదు చేశాడు. ఈ క్రమంలో కేసులో నిందితునిగా ఉన్న కస్టోడియన్… సిఐ ఖాజావలికి లంచం ఆఫర్ చేశాడు. కేసు తీవ్రతను తగ్గించి తనకు సహకరిస్తే భారీ మొత్తం లంచంగా ఇస్తానని ఆఫర్ చేయగా సిఐ ఖాజావలి దానికి అంగీకారం తెలిపాడు. ఈ క్రమంలో కేసు తీవ్రతను తగ్గించి కేసు విచారణను త్వరితగతిన ముగించే ప్రయత్నం చేశాడు. సిఐపై అనుమానంతో దీనిపై బాధితులుగా ఉన్న సంస్థ ప్రతినిధులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై గుంటూరు రేంజ్ ఐజి త్రివిక్రమ్ వర్మ విచారణకు ఆదేశించారు. ఐజి ఆదేశాలతో ఉన్నతాధికారులు విచారణ జరపగా సిఐ ఖాజావలి కేసు తీవ్రతను తగ్గించిన మాట వాస్తవమని, దానికి ప్రతిఫలంగా సిఐ ఖాజావలి 65 లక్షలు లంచంగా పుచ్చుకున్నట్లు తేలింది. నివేదికను పరిశీలించిన ఐజి త్రివిక్రమ్ వర్మ సిఐ ఖాజావలిపై అభియోగాలు రుజువు కావడంతో ఆయన్ను విధుల నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన కావలి రూరల్ సిఐగా పనిచేస్తున్నారు. ఖాజావలి సస్పెన్షన్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
One Comment
మొత్తానికి ఉద్యోగానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్నమాట.