వచ్చే నెల మొదటి వారంలో బ్యారేజీలు ప్రారంభం : మంత్రులు అంబటి, కాకాణి

Clock Of Nellore ( Sangam ) – నెల్లూరు బ్యారేజీ, మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ లను సెప్టెంబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జాతికి అంకితం చేయనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. శనివారం సంగం బ్యారేజ్ నిర్మాణ పనులను ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఎస్పీ విజయ రావు, జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి, జిల్లా ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రులు అంబటి రాంబాబు, కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా రెండు ప్రాజెక్టులను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఒకే జిల్లాలో రెండు భారీ ప్రాజెక్టులను ప్రారంభించడం నెల్లూరు జిల్లాకే గర్వకారణమన్నారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకాలు ఈ ప్రాంతంలో పదిలంగా ఉండాలనే లక్ష్యంతో సంగం బ్యారేజ్ కు మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ గా ముఖ్యమంత్రి నామకరణం చేసినట్లు గుర్తు చేశారు. పెన్నా డెల్టా ఆధునీకరణలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసిన అత్యంత ప్రాధాన్యత గల ఈ రెండు బ్యారేజ్ లను ఆయన తనయుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడం రైతుల అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. గతంలో జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి అధికంగా నిధులు మంజూరు చేసి, త్వరగా పూర్తయ్యేందుకు కృషి చేశారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలో భాగంగా మొదలు పెట్టిన అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు మంత్రులు చెప్పారు.

తొలుత మంత్రులు సంగం సమీపంలోని గురుకుల పాఠశాల ఎదురుగా సీఎం బహిరంగ సభ జరిగే ప్రదేశాన్ని, అనంతరం హెలీప్యాడ్ ను పరిశీలించి, చేపడుతున్న ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ముందుగా నెల్లూరు ఆర్ అండ్ బి అతిథి గృహంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి అంబటి రాంబాబును మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, జేసీ, పలువురు ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పిలు చౌడేశ్వరి, హిమవతి, తెలుగుగంగ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ హరి నారాయణ రెడ్డి, సోమశిల ఎస్ఈ వెంకట రమణారెడ్డి, ఇరిగేషన్ ఎస్ఇ కృష్ణమోహన్, ఆర్డిఓ మలోల, ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు, జిల్లాస్థాయి అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Read Previous

నెల్లూరుజిల్లా పోలీసులకు అవార్డులు : అందజేసిన మంత్రి కాకాణి

Read Next

వాడీవేడీగా జిల్లా సమీక్షా సమావేశం – సమస్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు

Leave a Reply

Your email address will not be published.