Clock Of Nellore ( Kavali ) – సభ్య సమాజం తలదించుకునే సంఘటన నెల్లూరుజిల్లాలో చోటుచేసుకుంది. స్నేహం అనే పదానికి కళంకం తెచ్చే విధంగా ఓ వ్యక్తి ప్రవర్తించిన దారుణమైన ప్రవర్తనతో ఆ దంపతులు ఏకంగా ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ పురుగుల మందు తాగారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భర్త పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే నెల్లూరు రంగనాయకులపేటలో షాహూల్ – అతని భార్య నివాసం ఉంటున్నారు. 6 నెలల క్రితం షాహుల్ కు ఇలియాజ్ అనే వ్యక్తి పరిచయం అయ్యి స్నేహితుడిగా మారాడు. ఈ క్రమంలో షాహుల్ భార్యపై ఇలియాజ్ కన్నేశాడు. షాహుల్ కు రోజూ మద్యం ఇప్పిస్తూ దానికి బానిసగా మార్చాడు. ఈ క్రమంలో ఓ రోజు షాహుల్ కు పూటుగా మద్యం తాగించి, కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి అతని భార్యకు ఇచ్చాడు. మత్తులోకి జారుకున్న షాహుల్ భార్యపై ఇలియాజ్ అత్యాచారం చేశాడు. అంతే కాకుండా దాన్ని సెల్ ఫోన్ లో వీడియో తీశాడు. వివస్త్రగా మత్తులో నిద్రపోతున్న ఆమెను వీడియో, ఫోటోలు తీశాడు.
ఇలా రెండు మూడు దఫాలు అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత తాను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని లేదంటే వీడియోలు బయటపెడతానని ఆమెను బెదిరించాడు. భర్తను కూడా బెదిరించాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన షాహుల్ దంపతులు ఇవాళ కావలి సమీపంలోని లింగసముద్రంలో వారి బంధువుల నివాసానికి వెళ్లి సెల్ఫీ వీడియో తీసుకుంటూ తమ పరువు పోయిందని, తమ చావుకు ఇలియాజ్ కారణమని చెబుతూ పురుగుల మందు తాగారు. దీన్ని చూసిన వారి బంధువులు చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశారు. అలాగే 108 కి సమాచారం అందించారు. దీంతో చుట్టుపక్కల వారు వారున్న నివాసానికి చేరుకుని వారికి సబ్బు నీళ్లు తాగించి వాంతులు చేయించి కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. భర్త పరిస్థితి విషమంగా ఉండగా, భార్య కోలుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.