నారాయణలో మహిళలకు ఉచిత పరీక్షలు : సద్వినియోగం చేసుకోవాలన్న వైద్యులు

Clock Of Nellore ( Nellore ) – ప్రపంచ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 9వ తేదీ నుండి 14వ తేదీ వరకూ నెల్లూరులోని నారాయణ జనరల్ హాస్పిటల్ లో మహిళలకు గైనకాలజీ వైద్యుల పర్యవేక్షణలో ఉచితంగా వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు, వివిధ స్కానింగులు చేయడంతో పాటూ వైద్యుల సలహాలను ఇవ్వనున్నట్లు హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి. హరిప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని 35 ఏళ్ల వయసు పై బడ్డ మహిళలు సద్వినియోగం చేసుకుని ఆరోగ్య సంరక్షణను పొందాలని సూచించారు. హాస్పిటల్ ఏజిఎం సి.హెచ్ భాస్కర్ రెడ్డి, గైనకాలజీ విభాగం అధిపతి డాక్టర్ వి. సీతాలక్ష్మితో కలిసి హరిప్రసాద్ రెడ్డి శనివారం విలేకరులతో మాట్లాడారు.

ఇల్లాలు ఇంటికి దీపమని, ఆ ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందని అన్నారు. అందుకే ఈనెల 8వ తేదీనా ప్రపంచ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఉచిత వైద్య సేవలను ప్రారంభిస్తున్నామన్నారు. 14వ తేదీ వరకూ జరిగే ఈ ఉచిత సేవల్లో 35 ఏళ్ల పై బడ్డ మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు, స్కానింగులు చేస్తామన్నారు. అంతే కాకుండా ఆరోగ్య సంరక్షణ కోసం గైనకాలనీ వైద్యులు, డైటీషియన్లు ఉచిత సలహాలు ఇస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గైనకాలజీ విభాగం అధిపతి డాక్టర్ వి. సీతాలక్ష్మి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళల్లో అధికంగా నెలసరి సమస్యలు, క్యాన్సర్ వ్యాధులు, గర్భకోశ వ్యాధులు అధిక మవుతున్నాయని చెప్పారు. సరైన అవగాహన, ముందస్తు పరీక్షలు, సరైన ఆహార నియమాలు పాటిస్తే సమస్యలకు దూరంగా ఉండవచ్చునని పేర్కొన్నారు. హాస్పిటల్ అందిస్తున్న ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

హాస్పిటల్ ఏజిఎం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ 2016లో మాతృ దినోత్సవం సందర్భంగా నారాయణ మాతృసేవా పథకం ద్వారా ఇదే విధంగా ఉచిత వైద్య సేవలు అందించామని అప్పుడు ఆ కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని చెప్పారు. వేల మంది మహిళలు ఆ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారని పేర్కొన్నారు. అప్పట్లో 19 రాష్ట్రాలకు చెందిన గర్భిణీ మహిళలు నారాయణ హాస్పిటల్ కు వచ్చి ఉచిత సేవలు పొందడం ఓ చరిత్ర అని గుర్తు చేశారు. దాన్ని స్పూర్తిగా తీసుకుని తాజాగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలియజేశారు. ఈ సేవల వివరాలు తెలుసుకునేందుకు 73311 70049, 73311 70057 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.

Read Previous

నాయుడుపేటలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు – ప్రారంభించిన హైకోర్టు సిజే మిశ్రా

Read Next

క్రీడలతోనే మానసిక వికాసం : పౌష్ఠికాహారం పంపిణీ చేసిన మేయర్ స్రవంతి

Leave a Reply

Your email address will not be published.