Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు వెంకటేశ్వరపురం జనార్ధన్ రెడ్డి కాలనీలో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. నెల్లూరు కార్పొరేషన్ అధికారులు ఎన్నిసార్లు అక్కడి పందుల పెంపకం దార్లకు హెచ్చరికలు జారీ చేసినా వారు పెడచెవిన పెడుతున్నారు. నివాసాల మధ్య పందులను వదిలేస్తున్నారు. ఆ పందులు ఒక్కో సారి స్థానికులపై దాడికి పాల్పడుతున్నాయి. తాజాగా శనివారం ఇంటి బయట ఆడుకుంటున్న ఏడాది వయస్సున్న బాలుణ్ని ఓ పంది కరుచుకొని ఈడ్చుకెళ్లింది. అక్కడే ఉన్న తల్లి గమనించి పందిని తరమడంతో బాలుడు గాయాలతో బయటపడ్డాడు. పంది దాడితో బాలుడి మెడ, వీపు, పొట్ట వద్ద గాయాలయ్యాయి. విషయం మీడియాకు తెలియజేయటంతో పందుల పెంపకం దారులు గాయపడ్డ బాలుడి తల్లి వద్దకు వెళ్లి 12వేల నగదు ఇస్తామని మభ్యపెట్టే ప్రయత్నం చేయగా ఆ తల్లి దానికి నిరాకరించింది. దీనిపై బాలుడి తల్లి మాట్లాడుతూ తన బిడ్డపై పంది దాడి చేయడం ఇదో మూడో సారి అని ఆవేదన వ్యక్తం చేశారు. నివాసాల మధ్య పందులు లేకుండా చూడాలని కార్పొరేషన్ అధికారులను వేడుకున్నారు. గాయపడ్డ బాలుణ్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు.