చనిపోయిన వ్యక్తి బ్రతికొచ్చాడు : అవాక్కయిన కుటుంబసభ్యులు

Clock Of Nellore ( Manubolu ) – మనస్థాపానికి లోనైన ఓ యువకుడు ఇంటి నుండి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులు అతని కోసం గాలించారు. ఎక్కడా ఆచూకీ దొరకలేదు. ఇంతలో చెరువులో శవమై కనిపించాడు. విషాదంలో మునిగిపోయిన ఆ కుటుంబం బరువెక్కిన గుండెల నడుమ అంత్యక్రియలు పూర్తి చేశారు. అంత్యక్రియలు పూర్తయిన పక్క రోజు చనిపోయిన యువకుడు ఇంటి వద్ద ప్రత్యక్ష మయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు అవాక్కయ్యారు. ఇది నిజమా కలా అని ఆశ్యర్యానికి గురైనారు. ఈ సంఘటన నెల్లూరుజిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మనుబోలు మండలం, వడ్లపూడి గ్రామానికి చెందిన పాలేటి వెంకయ్య, రమాదేవి దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో రెండో కుమారుడు సతీష్. నాలుగు రోజుల క్రితం సతీష్ ఇంట్లో నుంచి అలిగి బయటకు వెళ్లిపోయాడు. తల్లిదండ్రులతో పాటూ బంధువులు అతని కోసం గాలించారు. బంధువులు, సన్నిహితుల ఇళ్లకు వెళ్లి అతని కోసం ఆరా తీశారు. అయినా ఫలితం లేదు. ఈ నేపద్యంలో వెంకటాచలం మండలంలోని కనుపూరు చెరువులో ఓ వ్యక్తి శవమై కనిపించాడు. గుర్తు పట్టలేని విధంగా ఆ మృతదేహం ఉంది.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వెంకయ్య, రమాదేవి దంపతులకు కబురు పంపి మృతదేహాన్ని చూడమన్నారు. మృతదేహం తమ కుమారుడు సతీష్ దేనని వారు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వెంకయ్య, రమాదేవి దంపతులకు అప్పగించగా శనివారం అంత్యక్రియల్లో భాగంగా మృతదేహాన్ని ఖననం చేశారు. ఇవాళ ఉదయం అనగా ఆదివారం ఉదయం చిన్న కర్మచేసి ఇంటి కొచ్చి ఉండగా అందర్నీ ఆశ్చర్యకితులను చేస్తూ సతీష్ వారి నివాసానికి వెళ్లారు. దీంతో కుటుంబసభ్యులు అవాక్కయ్యారు. చనిపోయిన వ్యక్తి బ్రతికి రావడం ఏంటని భయపడ్డారు. ఇంతలో సతీష్ కలగజేసుకుని తాను అలిగి స్నేహితుల వద్దకు వెళ్లానని చెప్పాడు. కాసేపటికి తేరుకున్న సతీష్ తల్లిదండ్రులు తాము ఖననం చేసిన మృతదేహం ఎవరనే విషయం తెలియక తలలు పట్టుకున్నారు. కుమారుడు బ్రతికే ఉన్నాడని నిర్ధారించుకుని సంతోష పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఖననం చేసిన మృతదేహం ఎవరిదనే విషయంపై విచారణ జరుపుతున్నారు. చెరువులో దొరికిన మృతదేహం గుర్తు పట్టలేని విధంగా ఉండటం, శరీర ఆహార్యం తమ కుమారుడుదిలాగే ఉండటం, దుస్తులు కూడా పోలి ఉండటంతో మృత దేహం తమ కుమారుడేనని పొరపాటు పడ్డామని తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఇంతకీ ఖననం చేసిన మృతదేహం ఎవరిది అనే విషయాన్ని తేల్చేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Read Previous

సాగునీటి సలహా బోర్డు సమావేశం : 84.6 TMC ల నీటి విడుదలకు మంత్రి కాకాణి ఆదేశం

Read Next

ఐరన్ హిల్ పబ్ ను మూయించండి : పోలీసులను డిమాండ్ చేసిన సిపిఐ నేతలు

Leave a Reply

Your email address will not be published.