Clock Of Nellore ( Buchi ) – బుచ్చిరెడ్డి పాలెం మండలం జొన్నవాడ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) వద్ద నిర్వహించిన HPV వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వ్యాధి వచ్చాక చికిత్స కోసం ఇబ్బంది పడటం కంటే.. రాకుండా ముందుగానే నివారించుకోవడం ఉత్తమమని సూచించారు. ముఖ్యంగా ఆడవారిని వేధించే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన HPV వ్యాక్సిన్ ఒక గొప్ప రక్షణ కవచమని ఆమె పేర్కొన్నారు. మార్చి 11వ తేదీ నుండి మూడు నెలల పాటు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ కార్యక్రమం జరుగుతుందని 14 ఏళ్లు పూర్తయిన ఆడపి ల్లలందరూ HPV టీకా తీసుకోవడానికి అర్హులని తెలిపారు.
ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 15 వేల 600 మంది HPV వాక్సినైజేషన్ చేయించుకునేందుకు ఆన్ లైన్ లో ఎన్ రోల్ చేసుకున్నారని తల్లి దండ్రులు తమ అనుమతి పత్రాలను అందజేసి పిల్లలకు ‘గార్డసిల్ 4’ వ్యాక్సిన్ ఒక మోతాదు వేయించాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోరారు. వాక్సిన్ వేయించుకున్న వివరాలను U-Win పోర్టల్‌లో నమోదు చేసి ఆన్‌లైన్ ద్వారా సర్టిఫికేట్ కూడా అందజేస్తామని, ఈ ఉచిత అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్యాన్సర్ రహిత సమాజం కోసం అందరూ సహకరించాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వి సుజాత, HPV వ్యాక్సినేజేషన్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అమరేందర్ నాథ్ రెడ్డి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఉమామహేశ్వరి, జొన్నవాడ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ అహ్మద్ బాబు, డాక్టర్ వినయ్ కుమార్ లతో పాటు బుచ్చిరెడ్డి పాళెం మండల టిడిపి మరియు కూటమి నాయకులు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
