Clock Of Nellore ( Kovur ) – నెల్లూరు జిల్లా రైతాంగం పండించిన ప్రతి ధాన్యపు బస్తాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో కలిసి ఆయన కోవూరు మండలం, ఇనమడుగు గ్రామంలో నిర్వహించిన రైతు బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రైతుల సమస్యలపై అవగాహన ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు ఎమ్మెల్యేగా ఉండటం ఈ ప్రాంత రైతుల అదృష్టమని మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా ప్రశంసించారు. రబీ సీజన్ ప్రారంభానికి ముందు నుంచే ధాన్య సేకరణకు సంబంధించి పలు సార్లు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి శాసన సభలో ప్రస్తావించిన విషయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు గుర్తు చేశారు. జిల్లా నుంచి 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వం రెవెన్యూ మరియు పౌరసరఫరాల వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి విమర్శించారు. సాక్షాత్తు ఈ జిల్లాకు చెందిన వ్యక్తే వ్యవసాయ శాఖ మంత్రిగా వుండి రైతుల నుంచి ధాన్య సేకరణ విస్మరించి దళారులకు అప్పగించారన్నారు. ధాన్యం సేకరణలో రైతులకు గొనె సంచుల కొరత లేకుండా, లారీలు సకాలంలో అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఏ రైస్ మిల్ కు ధాన్యం ఇవ్వాలి అనేది వారి సొంత నిర్ణయమని పూర్తిగా వారు ఇష్టప్రకారమే రైస్ మిల్లును ఎంచుకోవాలని సూచించారు. ధాన్య సేకరణలో రైస్ మిల్లర్ల అవకతవకలు పాల్పడ్డా.. నిర్లక్ష్యంగా వ్యవహరించినా సహించేది లేదనన్నారు. ధాన్యం కొనుగోలులో అప్పటి ప్రభుత్వ నాయకులు గోల్ మాల్ చేసి రూ. 82 కోట్ల మేర అవినీతి చేశారని గత ప్రభుత్వంలో అన్నం పెట్టే రైతు మొర వినే నాధుడు లేరన్నారు.
రైతులు అవగాహనా రాహిత్యంతో ధాన్యం బయట అమ్మొద్దని అన్నదాతలు పండించిన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ యిచ్చారు. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిపాలన సాగిస్తున్నారని ఆయన కొనియాడారు. 22 శాతం తేమ ఉన్నా ధాన్యం తీసుకోవడంతో పాటు ఆధునిక ధాన్యం ఆరబెట్టుకునేందుకు రైతులకు డ్రయర్లు సౌకర్యం కల్పిస్తామన్నారు. గత ప్రభుత్వం రైతులకు 11.వేల 130 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ నిధులను విడుదల చేసి రైతులను ఆదుకుందని గుర్తు చేశారు. రైతుల నుంచి సేకరించే సోనామసూరి, బిపిటి వంటి మేలు రకం ధాన్యంతో ప్రభుత్వం వ్యాపారం చేయదని, దీనిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 41,000 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కోసం వినియోగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
అనంతరం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ధాన్య సేకరణలో కోవూరు ప్రాంత రైతాంగం ఎదుర్కొంటున్న విషయాన్ని చెప్పగానే స్పందించి సమస్య పరిష్కారానికై క్షేత్ర స్థాయి పరిశీలనకు వచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్ కు ఆమె కృతజ్ఞతలు తెలియచేసారు. కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి అని కొనియాడారు. రబీ సీజన్ ధాన్యం సేకరణ జరిగిన 24 గంటల్లోనే హమాలీ కూలీలతో సహా రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామని ఆమె గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలు చేసిన అన్నదాత సుఖీభవ ద్వారా ఏడాదికి 20 వేల ఆర్ధిక సహాయం, ల్యాండ్ యాక్ట్ రద్దు, రాజముద్రతో కూడిన కొత్త పాసుపుస్తకాల పంపిణీ చేసిన విషయాలను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. పేద, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన రేషన్ కార్డుల విభజన సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మంత్రి నాదెండ్ల మనోహర్ కు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్, పౌరసరఫర మరియు వ్యవసాయ శాఖ అధికారులు, రైతులతో పాటు స్థానిక తెలుగుదేశం మరియు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

