Clock Of Nellore ( Nellore ) – రాష్ట్రంలో ప్రజలకు కరెంటు కష్టాలు లేకుండా చేసేందుకు త్రీఫేజ్ మరియు 24 గంటల విద్యుత్ సరఫరా కోసం 9,139 కోట్లతో విద్యుత్ పనును శరవేగంగా సాగుతున్నాయని నెల్లూరు రూరల్ టిడిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తే లో ఓల్టేజీ సమస్య కూడా తీరుతుందన్నారు. నెల్లూరులోని ఆయన కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. విద్యుత్ పనులకు సంభందించి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 97% పనులు పూర్తయ్యాయని, మరో 10 రోజుల్లో పెండింగ్ పనులు కూడా పూర్తి చేసి ” చంద్రన్న విద్యుత్ వెలుగులు ” పేరుతో నూతన విద్యుత్ వ్యవస్థను ప్రజలకు అంకితం చేస్తామని కోటంరెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో అన్నీ రంగాల్లో ప్రజలకు మేలు చేసే పనులు చేస్తుందని, అందులో భాగంగా కోట్లాది మంది ప్రజలకు కరెంటు కష్టాలు లేకుండా విద్యుత్ పనులు నిర్వహించినట్లు వెల్లడించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 50 కోట్ల రూపాయల వ్యయంతో 18 గ్రామాలు, మూడు కార్పొరేషన్ డివిజన్లు, 28వేల కుటుంబాలు, 80వేల మంది ప్రజలకు కరెంటు కష్టాలు తీర్చే అభివృద్ధి పనులు త్వరలోనే పూర్తి కాబోతున్నాయని కోటంరెడ్డి తెలియజేశారు.