Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరంలోని మైపాడు గేటు సెంటర్ లో పైలెట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ను శనివారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నుండి వర్చువల్ గా ప్రారంభించారు. 7 కోట్ల రూపాయల వ్యయంతో 30 మాడ్యువల్ కంటెయినర్లతో 120 షాపులను పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు. ఒక్కో కంటెయినర్ లో నాలుగు షాపులు ఉండేలా డిజైన్ చేసి ఆయా షాపులను మహిళలు, దివ్యాంగులు, వెనుకబడిన వర్గాల వారికి కేటాయించారు. శనివారం రాత్రి స్మార్ట్ స్ట్రీట్ మార్కెట్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. నెల్లూరులో మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, నగర పాలక సంస్థ కమిషనర్ నందన్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సిఎం చంద్రబాబు అమరావతి నుండి మార్కెట్ ను వర్చువల్ ప్రారంభించి షాపులు పొందిన వారితో ప్రత్యక్షంగా మాట్లాడారు. అనంతరం మంత్రి నారాయణ లబ్ధిదారులకు షాపులకు సంభందించిన యాజమాన్య హక్కుల పత్రాలను అందజేశారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో తొలి స్మార్ట్ స్ట్రీట్ బజార్ నెల్లూరులో ప్రారంభం కావడం సంతోషంగా ఉందని అన్నారు. ఇంటికో మహిళా వ్యాపారవేత్తను తయారు చేయాలన్న ఆలోచనతోనే స్మార్ట్ స్ట్రీట్ బజార్ పురుడుపోసుకుందని వెల్లడించారు. రాష్ట్రంలోని మరో 8 మున్సిపాల్టీలలో పైలెట్ ప్రాజెక్టుగా స్మార్ట్ స్ట్రీట్ బజార్లను ఏర్పాటు చేస్తున్నామని, లబ్ధిదారులకు పైసా ఖర్చు లేకుండా వంద శాతం రుణం అందించామన్నారు.
