Clock Of Nellore ( Kavali ) – కుటుంబ పరిస్థితులు, ఆర్ధిక అవసరాలు.. కారణం ఏదో తెలియదు కానీ ఓ యువతి దిగరాని రొంపిలోకి దిగింది. ఓ వ్యక్తితో ఏకాంతంగా గడిపేందుకు అంగీకరించింది. తీరా ఆ ప్రదేశానికి వెళ్లగా ముగ్గురొచ్చారు. అంతటితో ఆగలేదు, ఆ ముగ్గురు యువతి పట్ల క్రూరంగా ప్రవర్తించారు. దిక్కుతోచని ఆ యువతి దిశ యాప్ ను ఓపెన్ చేసి SOS బటన్ నొక్కింది. లోకేషన్ ఆధారంగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతిని సురక్షితంగా కాపాడి ఆ ముగ్గుర్ని అరెస్టు చేశారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఆవుల ప్రసాద్ అనే వ్యక్తి నెల్లూరు కు చెందిన ఓ యువతిని ఏకాంతంగా గడిపేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ యువతిని ఆదివారం రాత్రి కావలి రూరల్ మండలం, తుమ్మలపెంటలోని సముద్రతీరంలో ఉన్న ఓ రిసార్ట్స్ కు తీసుకెళ్లాడు. అయితే అక్కడ సీన్ రివర్స్ అయింది. ఒక్కడినే అని చెప్పిన ఆవుల ప్రసాద్ మరో ఇద్దరు స్నేహితులను రిసార్ట్స్ కు పిలిపించాడు. ఆ యువతి ఇదేమని ప్రశ్నించగా ఆమెపై దాడి చేసి లైంగికంగా క్రూరంగా ప్రవర్తించారు. దిక్కుతోచని స్థితిలో ఆ యువతికి తన సెల్ ఫోన్ లో అప్పటికే డౌన్ చేసి ఉన్న దిశ యాప్ గుర్తుకొచ్చింది. వెంటనే ఫోన్ తీసుకుని యాప్ లోని SOS బటన్ ను నొక్కింది. స్పందించిన కావలి రూరల్ పోలీసులు సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా అర్దరాత్రి రిసార్ట్స్ కు చేరుకున్నారు. యువతిని సురక్షితంగా రక్షించారు. నిందితులు ఆవుల ప్రసాద్, వెంకటేశ్వర్లు, శంకర్ ను అదుపులోకి తీసుకొన్నారు. సోమవారం కావలి డిఎస్పీ వెంకటరమణ విలేకరుల సమావేశం నిర్వహించి ఆ ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్లు తెలియజేశారు. కష్ట సమయంలో ఆ యువతి దిశ యాప్ ను ఉపయోగించి బయటపడటం నిజంగా సంతోషం. కష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు ఏ మహిళ అయినా కుంగిపోకుండా తెలివితో ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది అనే దానికి ఈ యువతి చేసిన సాహసమే నిదర్శనం.
