Clock Of Nellore ( Nellore ) – ఈనెల 9వ తేదీ నుండి నెల్లూరులోని బారాషహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగకు లక్షల సంఖ్యలో భక్తులు రానున్న నేపద్యంలో జిల్లా ఎస్పీ విజయరావు అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పోలీసు, రెవెన్యూ, హెల్త్, మున్సిపల్ కార్పొరేషన్, విద్యుత్, అగ్నిమాపక, రోడ్లు – భవనాల శాఖల అధికారులతో నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమయ్యారు. ప్రత్యేకంగా ట్రాఫిక్ పై చర్చించారు. ఈ సందర్భంగా ఎస్పీ విజయరావు మాట్లాడుతూ రొట్టెల పండుగ జరిగే దర్గా ప్రాంతంతో పాటూ వాహనాల పార్కింగ్ ప్రదేశాలను 5 సెక్టార్లుగా విభజించామన్నారు. నగరంలో 10 డైవర్షన్ పాయింట్స్, 13 మేజర్, 12 మైనర్ పార్కింగ్ ప్రదేశాలను గుర్తించామని ఎస్పీ పేర్కొన్నారు. 14 ట్రాఫిక్ జంక్షన్ పాయింట్లు, 74 సాధారణ ట్రాఫిక్ రెగ్యులేషన్ పాయింట్లను గుర్తించామని, అన్నీ పార్కింగ్ ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు, కంట్రోల్ రూములు, సిసి కెమరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రముఖులకు ప్రత్యేకంగా పాస్ లు జారీ చేస్తామని చెప్పారు.
