Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని బారా షహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. సతీమణి, కుమార్తె, మనుమరాలితో కలిసి దర్గాకు చేరుకున్న కోటంరెడ్డికి దర్గా కమిటి సభ్యులు స్వాగతం పలికారు. ఇందులో భాగంగా వారు దర్గాలోని బారా షహీదుల సమాధుల వద్ద ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం స్వర్ణాల చెరువు వద్దకు చేరుకుని అతి పెద్ద కోర్కెల రొట్టెను అందుకున్నారు. తదుపరి కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ దర్గా అభివృద్ధికి దివంగత మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి తొలి పునాది రాయి వేశారని, అక్కడి నుండి కేంద్ర మంత్రిగా పనిచేసిన ముప్పవరపు వెంకయ్య నాయుడు, గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పొంగూరు నారాయణ, అప్పటి మేయర్ అబ్ధుల్ అజీజ్, ప్రస్తుత రూరల్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి కృషి చేశారని గుర్తు చేశారు. తనకు కూడా బారా షహీద్ దర్గాతో గత 15 ఏళ్లుగా అనుబంధం ఉందని, ముఖ ద్వారాల నిర్మాణానికి ఎమ్మెల్యేగా తాను నుడా నుండి కోటి రూపాయలు మంజూరు చేయించానని, ముఖ ద్వారాల పనులు 70 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయించాలని రూరల్ ఇంచార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డిని కోరారు. అలాగే ఈద్గా పనులు కూడా తానే దాదాపుగా పూర్తి చేయించానని, మిగిలిన పనులు కూడా పూర్తి చేయాలన్నారు. దర్గాలో మసీదు నిర్మాణానికి 7 కోట్లా 50 లక్షలు మంజూరు చేయించానని, ఆ పనులకు టెండర్లు పిలిచినా ఇంకా పనులు మొదలు కాలేదన్నారు. ఇప్పటి వరకూ బారా షహీద్ దర్గాలో 15 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు గానూ 3 కోట్ల రూపాయల పనులు చేశారని అయితే పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయని కోటంరెడ్డి గుర్తు చేశారు. రూరల్ ఇంఛార్జ్ గా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి బాధ్యత తీసుకుని పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. దర్గా అభివృద్ధి విషయంలో ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని కోటంరెడ్డి స్పష్టం చేశారు.
