Clock Of Nellore ( Srihari Kota ) – ఉమ్మడి నెల్లూరుజిల్లా, శ్రీహరికోటలోని సతీష్ థవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో ) శుక్రవారం చేపట్టిన చంద్రయాన్ – 3 ప్రయోగం విజయవంతం అయింది. బాహుబలిగా పిలుచుకునే LVM3-M4 రాకెట్ ద్వారా చంద్రయాన్ – 3 ను శాస్త్రవేత్తలు ప్రయోగించారు. శుక్రవారం మధ్యాహ్నం సరిగ్గా 2 గంటలా 35 నిముషాలకు LVM3-M4 రాకెట్ రెండో లాంచ్ ప్యాడ్ నుండి నిప్పులు చిమ్ముతూ గగనతలంలోకి ప్రవేశించింది. శాస్త్రవేత్తలు నిర్ధేశించిన మార్గంలోనే ఖచ్చితత్వంతో ప్రయాణించిన LVM3-M4 రాకెట్ సరిగ్గా 16 నిముషాల తర్వాత చంద్రయాన్ కు సంభందించిన ప్రొపల్షన్ మాడ్యూల్ ను భూ స్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీంతో చంద్రయాన్ – 3 మిషన్ లో మొదటి భాగం విజయవంతం అయింది. ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ భూమి చుట్టూ తిరుగుతూ తన కక్ష్యను పెంచుకుంటుంది. అంతరిక్షంలో 40 రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం ప్రొపల్షన్ మాడ్యూల్ ను చంద్రుని కక్ష్య అయిన లూనార్ ఆర్భిటర్ లోకి శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టనున్నారు. చంద్రుని కక్ష్యలో తిరుగుతూ ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి ల్యాండర్ వేరుకానుంది. ఆగస్టు 23 లేదా 24వ తేదీనా ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ ను చంద్రుని భూ భాగంపై దక్షిణం వైపు ల్యాండింగ్ చేయనున్నారు. ల్యాండింగ్ అనంతరం దాని నుండి రోవర్ చంద్రునిపై తిరుగుతూ కీలకమైన సమాచారాన్ని ఇస్రోకి పంపనుంది. ప్రయోగం విజయవంతంపై ప్రధాని నరేంద్రమోడీ నుండి యావత్తు భారతదేశం మొత్తం సంతోషం వ్యక్తం చేసింది. ఇస్రో ఛైర్మైన్ డాక్టర్ సోమనాథ్ తో పాటూ శాస్త్రవేత్తలను అభినందించారు.
