Clock Of Nellore ( Manubolu ) – నెల్లూరుజిల్లాలో పాల ట్యాంకర్ల వ్యాగన్లతో వెళుతున్న గూడ్సు రైలు పట్టాలు తప్పింది. మంగళవారం ఉదయం విజయవాడ వైపు నుండి తిరుపతికి వెళ్తుండగా నెల్లూరుజిల్లా, మనుబోలు మండలం, కొమ్మలపూడి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. దీంతో ఓ వ్యాగన్ పట్టాలపైనే కిందకు ఒరిగిపోయింది. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని కిందికి ఒరిగిపోయిన వ్యాగన్ ను రైలు నుండి వేరు చేశారు. మిగిలిన బోగీలతో కూడిన రైలును లూప్ లైన్ లోకి చేర్చారు. రైలు పట్టాలు తప్పిన నేపద్యంలో అక్కడక్కడా రైల్వే ట్రాక్ దెబ్బతింది. రైల్వే ఇంజనీరింగ్ బృందం అక్కడకు చేరుకుని మరమ్మత్తు పనులు చేపట్టింది. మరో వైపు గూడ్సు రైలు పట్టాలు తప్పిన నేపద్యంలో విజయవాడ వైపు నుండి చైన్నై, తిరుపతి వెళ్లే మార్గంతో పాటూ… చైన్నై వైపు నుండి నెల్లూరు వైపు వెళ్లే అనేక రైళ్లు ఆలస్యంగా నిడిచాయి. మూడో లైన్ అందుబాటులో ఉండటంతో అనేక రైళ్లను ఆ ట్రాక్ ద్వారా నడిపించారు.
