నెల్లూరుజిల్లాలో మంత్రి నాదెండ్ల సుడిగాలి పర్యటన : అధికారులు, మిల్లర్లతో సమీక్షలు

Clock Of Nellore ( Nellore & Sarvepalli ) – దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా రైతులకు అత్యంత గౌరవం ఇచ్చిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ మీద వారి పేరు ఉండేలా, ఎక్కడ పండించిందో తెలిసేలా ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ను ముద్రించి రైతుల శ్రమను భావితరాలకు తెలిసేలా చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది అని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. రాష్ట్రంలోని 41 వేల పాఠశాలల్లో, 400 కు పైగా సంక్షేమ వసతి గృహాల్లో రైతుల పండించిన సన్నబియ్యాన్ని పిల్లలకు అందించడం ద్వారా, వారు తింటున్న భోజనం తాలూకా ధాన్యం ఎవరు పండించారో తెలిసేలా బియ్యం సరఫరా బ్యాగులపై ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ మోడల్ ను దేశంలోనే మొదట అమలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోతుంది చెప్పారు. ఈ పద్ధతి దేశానికి రోల్ మోడల్ కానుందని అన్నారు. ఖరీఫ్ ధాన్యం ఆలస్యంగా కొనుగోలు చేస్తున్న నెల్లూరు జిల్లా పై ప్రత్యేక దృష్టి సారించి, సోమవారం ఆయన నెల్లూరు జిల్లాలోని కోవూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో ధాన్యం కొనుగోలు తీరును పరిశీలించారు. స్వయంగా రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను, సమస్యలను తెలుసుకున్నారు.

అనంతరం నెల్లూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైస్ మిల్లర్లు, రైతులు, జిల్లా అధికారులతో మంత్రి మనోహర్ 3 గంటల పాటు సమీక్షా సమావేశం నిర్వహించారు. మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలని, రైతులను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. జిల్లాలో ధాన్యం సేకరణకు ఉపయోగించే వాహనాల సమస్య, గోనె సంచుల సమస్య ఉందని దీని పరిష్కరించేలా సమష్టిగా పని చేయాలని సూచించారు. సమీక్ష అనంతరం మీడియాతో మంత్రి మనోహర్ మాట్లాడుతూ ” కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం. గత ప్రభుత్వం నెల్లూరు జిల్లాలో మూడు సంవత్సరాల కాలంలో కనీసం ఒక్క ధాన్యపు గింజ కొనలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 75 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కేవలం నెల్లూరు జిల్లాలోనే సేకరించాం. ఈ ఏడాది రెండు లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని నెల్లూరు జిల్లాలో పెట్టుకున్నాం. దానికి అనుగుణంగా ఇప్పటివరకు 60 వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం సేకరించాం. మరి కొద్ది రోజుల్లో అనుకున్న లక్ష్యం చేరుకుంటాం. చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా ఈ ఖరీఫ్లో రాష్ట్రం మొత్తం మీద 51 లక్షల మెట్రిక్ టన్నులను కూటమి ప్రభుత్వం సేకరించింది. ధాన్యం సేకరించడమే కాదు 24 గంటల్లో రైతు ఖాతాలకు ధాన్యం డబ్బులు జమ చేసి రైతులకు అండగా ఉన్నామని చాటాం అని మంత్రి వెల్లడించారు.

సమస్యలు అన్ని పరిష్కరిస్తాం…
ధాన్యం సేకరణ ను క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు కొన్ని సమస్యలు నా దృష్టికి వచ్చాయి. ధాన్యం సేకరణ కు ఉపయోగించే వాహనాలు విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. దీనిపై జిల్లా కలెక్టర్ తో మాట్లాడాం. రవాణా శాఖ ఉప కమిషనర్ తో చర్చించుకుని అదనపు వాహనాలు ఏర్పాటు చేసి, సమస్యను తీరుస్తాం. రైస్ మిల్లర్లు బ్యాంకు గ్యారంటీల విషయంలో ఇబ్బందులు పడుతున్నట్లు సమీక్ష సమావేశంలో తెలిపారు. వారి సౌలభ్యాన్ని, రైతులకు వారు మరింతగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఉన్న 1:2 బ్యాంకు గ్యారంటీ ను సవరించి, ఇక నుంచి జిల్లా వ్యాప్తంగా 1:3 రేషియోలో బ్యాంకు గ్యారంటీలు తీసుకునే ఏర్పాటు చేస్తాం. దీనివల్ల ధాన్యం సేకరణలో వేగం మరింత పెరుగుతుంది. ఇప్పటివరకు రోజుకు కేవలం 5వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సగటున సేకరిస్తున్నట్లు తెలిసింది. ఇప్పుడు లోపాలను సవరిస్తే రోజుకు 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ సాధ్యం అవుతుందని భావిస్తున్నాం. కచ్చితంగా అనుకున్న లక్ష్యలను సాధిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

రైతులకు కృతజ్ఞతలు….
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే బిడ్డలకు మేలైన రకం బియ్యం అందిస్తున్న రైతంగానికి కృతజ్ఞతలు. భావితరాలకు సన్నబియ్యంతో భోజనం అందించాలనే కూటమి ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా, రైతులు మాకు సహకరించారు. మద్దతు ధరకు ఏమాత్రం అదనపు బోనస్ అడగకుండానే భావితరాలకు అవసరమైన సన్న బియ్యం 2.80 లక్షల మెట్రిక్ టన్నులను ప్రభుత్వానికి అందించారు. వారి సేవలు ఎనలేనివి. రైతులను ఇబ్బంది పెట్టే రైస్ మిల్లర్ల పై కఠినంగా వ్యవహరిస్తాం. ధాన్యం సేకరణ విషయంలో గానీ, రైతులను రోజులకు తరబడి రైతులను రోజులు తరబడి రైస్ మిల్లుల వద్ద వేచి ఉండేలా చేసే వారిపై చర్యలు ఉంటాయి. గన్ని బ్యాగుల పంపిణీ కూడా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం. సమీక్ష తర్వాత కూడా దారికి రాని రైస్ మిల్లర్లను ఉపేక్షించేది లేదు. ప్రభుత్వం పూర్తిగా రైస్ మిల్లర్లకు సహకరిస్తుంది. వారు కూడా రైతులకు తగిన సహాయం చేసేలా పని చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ సమీక్షలో రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ పట్టాభిరామిరెడ్డి పాల్గొన్నారు.

Read Previous

ప్రతి ఒక్కరి సొంతింటి కల నెరవేరుస్తా : నాయుడుపేటలో సిఎం చంద్రబాబు

Read Next

రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత లేదు : స్పష్టం చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్

Leave a Reply

Your email address will not be published.