Clock Of Nellore ( Kodavalur ) – నెల్లూరుజిల్లాలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురైనారు. వరికోత మిషన్ ఆపరేటింగ్ కోసం బైకుపై డీజిల్ తీసుకెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వారిని అడ్డగించి కత్తులతో పొడిచి చంపారు. ఆదివారం రాత్రి ఇద్దరు యువకులు ఇంటి నుండి వెళ్లగా తిరిగి రాలేదు. సోమవారం ఉదయం పొలాల్లో యువకుల మృతదేహాలు ఉండగా కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వివరాల్లో కెళ్తే… దగదర్తి మండంల, పెద పుత్తేడు గ్రామానికి చెందిన వెంకటేష్, సంగం మండలం, రంగారెడ్డిపాళెంకు చెందిన బాల వెంకయ్య అనే ఇద్దరు యువకులు వరికోత మిషన్ ఆపరేటర్స్ గా పనిచేస్తున్నారు. వరికోత మిషన్ కు డీజిల్ తెచ్చేందుకు నిన్న రాత్రి బైక్ పై సమీపంలోని గండవరం ప్రాంతానికి వెళ్లారు. డబ్బాలో డీజిల్ నింపుకుని తిరిగి వెళ్తుండగా కొందురు వ్యక్తులు కొడవలూరు మండలం, గండవరం పొలాల వద్ద అడ్డగించి దారుణంగా హత్య చేశారు. ఇవాళ ఉదయం కొందరు వ్యక్తులు మృతదేహాలను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా అదనపు ఎస్పీ సౌజన్య, డిఎస్పీ శ్రీనివాసరావు, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సిబ్బందితో వెళ్లి ఆధారాల కోసం అన్వేషించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. గండవరం సమీపంలోని వడ్డిపాళెంకు చెందిన ఓ యువతితో వెంకటేష్ కు అక్రమ సంబంధం ఉందని, ఆ యువతికి సంభందించిన వారే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మువ్వా వెంకయ్య అనే వ్యక్తే యువకులను హత్య చేసినట్లు మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.