Clock Of Nellore ( Naidupet ) – ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ 2029 నాటికి ఇల్లు నిర్మించి ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రతి పేద కుటుంబానికి శాశ్వతంగా ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నదే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం, పుదూరులో టిడ్కో గృహాల గృహ ప్రవేశ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. శిలా ఫలకాన్ని ఆవిష్కరించి లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందించారు. టిడ్కో గృహాల వద్ద ఏర్పాటు చేసిన పార్కు, వాకింగ్ ట్రాక్, ఇతర మౌలిక సదుపాయాలను ఆయన పరిశీలించారు. రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 30 ప్రాంతాల్లో 2 లక్షల 50 వేల 893 గృహాలను ప్రభుత్వం అందించింది. జీ+3 విధానంతో సకల హంగులు, పూర్తి నాణ్యతతో ఈ ఇళ్లను నిర్మించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, అనగాని, పార్థసారథి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 2.50 లక్షల మంది గృహప్రవేశాలు జరుగుతున్నాయంటే చరిత్ర అని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఇది రెండోసారి గృహ ప్రవేశాలు చేస్తున్నామని వెల్లడించారు. పేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ నిర్ణయమని తెలిపారు. 2029 వరకు ఇళ్లు లేని వారికి ఇల్లు నిర్మించి ఇస్తామని తిరుపతి జిల్లాలో 15,659 ఇళ్లు నిర్మించి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 5.50 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని డిసెంబర్‌లోపు మరో 4.50 లక్షల ఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పారు. మెుత్తం డిసెంబర్‌లోపు 10 లక్షల ఇళ్లు పేదలకు కట్టించి అందజేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
కూటమి అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశామని, 63 లక్షల మందికి మొదటి తేదీనే పింఛన్లు ఇస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తున్నామని అలానే స్త్రీశక్తి కింద మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని వెల్లడించారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమం అందిస్తున్నామని పేర్కొన్నారు. అదే విధంగా పోలవరాన్ని గత ప్రభుత్వం నాశనం చేసిందని మండిపడ్డారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. అనకాపల్లిలో స్టీల్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని, దాని ద్వారా లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. హైదరాబాద్, చెన్నై కంటే అమరావతిని నెంబర్ వన్‌లో నిలబెడతామని సీఎం చంద్రబాబు అన్నారు. సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తున్నామని, అలానే సాంకేతికత ఎప్పటికప్పుడు అనుసంధానం చేస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. అమరావతి రాజధానిపై తీర్మానం చేసి కేంద్రానికి పంపామని, చట్టం రూపుదాల్చాక రాజధానిని ఎవరూ కదల్చలేరని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నుంచి ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుడుతున్నానని, బాగా పనిచేసిన అధికారిని అభినందిస్తానని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజల్లోనే అడుగుతానని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా పనిచేస్తేనే సత్ఫలితాలు వస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు.
