Clock Of Nellore ( Nellore ) – శరీరంలోని అన్నీ అవయవాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధానంగా ప్రేగు ఆరోగ్యంగా ఉండాలని, ప్రేగును ఆరోగ్యంగా ఉంచుకుంటే శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ కే. శ్రీధర్ రెడ్డి తెలిపారు. ప్రేగు యొక్క ప్రాముఖ్యత, జీర్ణ సంబంధిత సమస్యలు, చికిత్సలపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. మనిషి ఆరోగ్య సంరక్షణలో జీర్ణ వ్యవస్థ ఎంతో ముఖ్యమైందని అన్నారు. జీర్ణ వ్యవస్థ కేవలం ఆహారాన్ని జీర్ణం చేయడమే కాకుండా, శరీరంలోని అనేక ఇతర కార్యకలాపాలను ప్రభావితం చేస్తుందని, ప్రేగు ఆరోగ్యం అంటే… మన జీర్ణ వ్యవస్థలో నివసించే బ్యాక్టీరియా, వైరస్ లు, ఫంగల్ లాంటి ట్రిలియన్స్ సూక్ష్మ జీవులు సమతుల్యంగా ఉండటమేనన్నారు. ఆహారంలోని పోషకాలను గ్రహించి వాటిని శరీరానికి అందించేందుకు మెరుగైన జీర్ణ ప్రక్రియ కావాలని అన్నారు. అలాగే మన రోగ నిరోధక వ్యవస్థలో దాదాపు 70 శాతం ప్రేగులోనే ఉంటుందని, ఆరోగ్యకరమైన ప్రేగు చెడు బ్యాక్టీరియాతో పోరాడి, రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుందన్నారు. ప్రేగు మరియు మెదడు మధ్య బలమైన సంబంధం ఉంటుందని, ప్రేగులోని సూక్ష్మ జీవులు మానసిక స్థితిని ప్రభావితం చేసే సెరోటోనిన్ వంటి న్యూరో ట్రాన్స్ మీటర్ల ఉత్తత్తిలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రేగు వాపుకు గురికాకుండా ఉండాలంటే ప్రేగు ఆరోగ్యంగా ఉండాలన్నారు. ప్రేగు ఆరోగ్యం జీవక్రియ మరియు శరీర బరువును సమతుల్యం చేస్తుందని డాక్టర్ శ్రీధర్ రెడ్డి వెల్లడించారు.
ప్రేగు ఆరోగ్యాన్ని అనేక అంశాలు ప్రభావితం చేస్తుంటాయని ప్రధానంగా ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర, తక్కువ ఫైబర్ ఉన్న ఆహారాలు ప్రేగు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయన్నారు. మితిమీరిన యాంటీ బయోటిక్స్ వల్ల ప్రేగులోని మంచి బ్యాక్టీరియా చనిపోయి దాని ప్రభావం ప్రేగు ఆరోగ్యంపై చూపుతుందని చెప్పారు. అలాగే దీర్ఘకాలిక ఒత్తిడి, నిద్ర లేకపోవడం, పర్యావరణ కారకాల వల్ల కూడా ప్రేగు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయన్నారు. ప్రేగు ఆరోగ్యంగా ఉండాలంటే ఫైబర్ పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవాలని, పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, చిక్కుళ్లు లాంటి వాటిల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుందని దాని వల్ల ప్రేగులో మంచి బ్యాక్టీరియా తమతుల్యంగా వృద్ధి చెందుతుందని వెల్లడించారు. పెరుగు, మజ్జిగ, పులియబెట్టిన ఆహారాలు వంటివి కూడా ప్రేగులోకి మంచి బ్యాక్టీరియాను చేర్చుతాయని డాక్టర్ కే. శ్రీధర్ రెడ్డి తెలియజేశారు. మోతాదుకు మించిన చక్కెర పదార్ధాలకు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలని, తగినంత నీరు తాగాలని, ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం ఇతర విశ్రాంతి పద్దతులను పాటిస్తూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ప్రేగు ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. అవసరం అయితే తప్పా యాంటీ బయోటిక్స్ ను వాడవద్దని హెచ్చరించారు. నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో ప్రేగు సంబంధిత వ్యాధులకు అధునాతన నిర్ధారణ పరీక్షలతో పాటూ వ్యాధి నివారణకు వైద్యం అందించే అనుభవజ్ఞులైన గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యుల బృందం అందుబాటులో ఉందని డాక్టర్ కే. శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. ప్రేగు సంబంధిత రోగులు మెడికవర్ హాస్పిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన ప్రేగు, ఆరోగ్యకరమైన జీవితానికి పునాది అని పిలుపునిచ్చారు.