Clock Of Nellore ( Nellore ) – ఈనెల 29వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకూ నెల్లూరులోని బారాషహీద్ దర్గాలో రొట్టెల పండుగ జరగనుంది. ఈ పండుగ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ నేపద్యంలో శుక్రవారం రొట్టెల పండుగ నిర్వహణ ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా దర్గా ప్రాంగణంలోని షామియనాలు, కమాండ్ కంట్రోల్ విభాగం, వి.ఐ.పి రిసెప్షన్, సి.సి కెమెరాలు, విద్యుత్ లైటింగ్, పారిశుద్ధ్యం, స్త్రీలకు పురుషులకు విడిగా మరుగుదొడ్లు, పార్కింగ్, మహిళల రక్షణ, బారికేడ్ల నిర్మాణం, పోలీసుల పర్యవేక్షణ, జోన్ల వారిగా హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు, స్వర్ణాల చెరువు తీరం వెంబడి భద్రతా చర్యలను వారు పరిశీలించారు. రొట్టెల పండుగకు రానున్న భక్తులను దృష్టిలో ఉంచుకుని నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో దర్గా ప్రాంగణంలో అన్ని వసతులు ఏర్పాటు చేస్తూ, పర్యవేక్షించనున్నామని తెలిపారు. అన్ని ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేసుకుని, నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది పర్యవేక్షణలో రొట్టెల పండుగను ఘనంగా నిర్వహించేందుకు కృషి చేయనున్నామని వెల్లడించారు. పండుగకు విచ్చేసే భక్తులంతా క్రమశిక్షణగా రొట్టెలు మార్చుకునేలా, దర్గాలో మొక్కులు చెల్లించుకునేలా పటిష్ట ఏర్పాట్లను పూర్తి చేసామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ యస్.ఈ.సంపత్ కుమార్ , డీ.సి.పి. దేవి కుమారి, ఆరోగ్య శాఖాధికారి వెంకట రమణ, స్థానిక కార్పొరేటర్లు, కో ఆప్షన్ మెంబర్లు, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు, దర్గా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
