
Clock Of Nellore ( Nellore ) – పోషించలేమంటూ తల్లిదండ్రులను ఇంటి నుండి గెంటేస్తున్న నేటి కాలంలో తల్లి మాటను శాసనంగా పాటిస్తున్నాడు నెల్లూరు నగరానికి చెందిన ఓ యువకుడు. ఎప్పుడో తాను పుట్టక ముందు అమ్మవారికి తల్లి మొక్కిన మొక్కును తీర్చి శభాష్ అనిపించుకున్నాడు ఈ అభినవ శాతకర్ణుడు. వివరాల్లోకి వెళితే… నెల్లూరు మూలాపేటకు చెందిన నెల్లూరు ఉపేంద్ర, సులోచన దంపతులకు మొదట్లో సంతానం కలగలేదు. దీంతో సులోచన ఇరుకళల పరమేశ్వరి అమ్మవారికి సంతానం కోసం పూజలు నిర్వహించే వారు. తనకు సంతానం కలిగితే పరమేశ్వరి అమ్మవారి అలంకరణతో ఊరేగింపుగా దేవస్థానానికి తీసుకొస్తానని మొక్కుకున్నారు. మొక్కు అనంతరం సులోచనకు భాను ప్రకాష్ సంతానంగా కలిగాడు. భాను ప్రకాష్ కు ఈనెల 7వ తేదీన వివాహం జరగనుంది. ఈ క్రమంలో పాతికేళ్ల తర్వాత తల్లి మొక్కును తెలుసుకున్నాడు భాను ప్రకాష్. హార్డ్ వేర్ ఇంజనీర్ అయిన భాను ప్రకాష్ తల్లి మొక్కును తీర్చాలని నిర్ణయించుకున్నాడు. బుధవారం అమ్మవారి అలంకరణ చేయించుకున్నాడు. కుటుంబసభ్యులతో కలిసి ఇంటి నుండి అమ్మవారి అలంకణతో మేళతాళాలతో ఊరేగింపుగా ఇరుకళల అమ్మవారి దేవస్థానానికి వెళ్లి పూజలు నిర్వహించి అనంతరం తల్లి మొక్కు తీర్చాడు. ఈ సందర్భంగా భాను ప్రకాష్ మాట్లాడుతూ తల్లి మొక్కు తీర్చడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.