
Clock Of Nellore ( Nellore ) – సింహపురి వాసులచే తొలి పూజలందుకునే శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవి శరన్నవరాత్రి మహోత్సవములు ఘనంగా నిర్వహించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు. శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అక్టోబర్ 3 నుండి 12 వ తేదీ వరకు నిర్వహించనున్న దృష్ట్యా నెల్లూరు ఆర్డీఓ మలోల ఆధ్వర్యంలో దేవాలయ ప్రాంగణంలో ఆదివారం సన్నాహాక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విచ్చేసిన శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు విశేషంగా భక్తులు హాజరవుతారని అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆధ్యాత్మిక భావన దెబ్బతినకుండా, అమ్మవారి దర్శనం సంపూర్ణంగా జరిగిందని భక్తులు సంతృప్తిని వ్యక్తం చేసేవిధంగా ఏర్పాట్లు ఉండాలన్నారు. ఇందుకుగాను వట్టూరు సురేంద్ర యాదవ్ చైర్మన్ గా ఉత్సవ కమిటీను ఏర్పాటు చేశామన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు పదవిగా భావించకుండా బాధ్యతగా భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు. నిరంతర మంచినీటి వసతి సౌకర్యం, అంతరాయం లేని విద్యుత్ సౌకర్యం, క్యూ లైన్లలో తోపులాటలు జరగకుండా నిరోధించడం తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సందర్బంగా ఉత్సవ విశేషాలను తెలిపే బ్రోచర్ ను ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ జనార్దన్ రెడ్డి, ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.